ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో జనాభా ఆధారంగా అందించే రిజర్వేషన్లపై ఛత్తీస్‌గఢ్ శాసనసభ సంచలన నిర్ణయం తీసుకుంది. 5 గంటలకుపైగా జరిగిన సుదీర్ఘ చర్చలో రిజర్వేషన్లకు సంబంధించిన 2 బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. దీంతో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా 76 శాతానికి చేరింది. ఈ బిల్లుల ప్రకారం షెడ్యూల్ తెగలకు 32 శాతం, ఇతర వెనకబడిన కులాలకు 27 శాతం, షెడ్యూల్ కులాలకు 13 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. మరో 4 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించారు.
ఆ రాష్ట్రంలో 76 శాతానికి రిజర్వేషన్లు.. అసెంబ్లీలో కీలక బిల్లులు పాస్ - ఛత్తీస్‌గఢ్ రిజర్వేషన్లు
ఛత్తీస్‌గఢ్ శాసనసభ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కీలక బిల్లులను ఆమోదించింది. దీంతో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా 76 శాతానికి చేరింది.
గత భాజపా ప్రభుత్వాలు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల రిజర్వేషన్లకు సంబంధించి పరిమాణాత్మక డాటా కమిషన్‌ను ఏర్పాటు చేయలేకపోయాయని... తమ ప్రభుత్వం 2019లో ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం భూపేశ్ బఘేల్ వివరించారు. కరోనా కారణంగా కమిషన్ ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలిపారు. స్పీకర్ నేతృత్వంలో ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యేలంతా ప్రధానిని కలిసి... ఈ సవరణ బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరాలని విజ్ఞప్తి చేశారు. పరిమాణాత్మక డాటా కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టలేదని ఆరోపించిన భాజపా... జనాభా ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించామని ప్రభుత్వం చెబుతున్నదానికి నిర్దిష్టమైన సమాచారం లేదని ఆరోపించింది.