ఉత్తరాఖండ్‌లో వరదలు సృష్టించిన విషాద ఘటనలో ఆచూకీ తెలియని వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఘటన జరిగి 11 రోజులు అయ్యింది. తపోవన్ సొరంగం నుంచి ఇప్పటికే 11 మృతదేహాలను బయటకు తీశారు. అందులో చిక్కుకుపోయిన మరికొందరి కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. తాజాగా సొరంగంలో మరోసారి నీరు చేరుతుండడంతో సహాయ చర్యలు మందకొడిగా సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
తపోవన్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ఓవైపు సొరంగంలో బురదను తొలగిస్తూనే, మరోవైపు సొరంగానికి రంధ్రం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు బురదను తొలగించుకుంటూ దాదాపు 150 మీటర్ల లోపలికి వెళ్లగలిగినట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ ఏపీ సింగ్ వెల్లడించారు. అయితే, దాదాపు 190మీటర్ల లోపల కార్మికులు చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్న అధికారులు, శిథిలాలను తొలగించుకుంటూ ముందుకు సాగుతున్నారు.