తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గణతంత్ర' శకటాలపై రాజకీయ దుమారం- సీఎంలకు రాజ్​నాథ్​ లేఖలు

Republic day celebrations: ఈసారి అరగంట ఆలస్యంగా గణతంత్ర వేడుకలు ప్రారంభమవుతాయని రక్షణ శాఖ వెల్లడించింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు వేడుకల్లో 12 రాష్ట్రాల శకటాలను మాత్రమే ప్రదర్శించనున్నట్లు స్పష్టం చేసింది. బంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు ప్రతిపాదించిన శకటాలను ప్రదర్శించలేని పేర్కొంది.

republic day celebrations
గణతంత్ర వేడుకలు

By

Published : Jan 18, 2022, 5:33 PM IST

Republic day celebrations: జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అరగంట ఆలస్యంగా ప్రారంభమవుతాయని రక్షణశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు వేడుకలు మొదలవుతాయని తెలిపింది. విమాన విన్యాసాలకు ఆ సమయం అనుకూలంగా ఉన్నందునే సమయంలో మార్పులు చేసినట్లు వివరించింది.

శకటాలపై రాజకీయ దుమారం..

గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించే శకటాలపై ఈసారి రాజకీయ దుమారం చెలరేగింది. బంగాల్​, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు తమ శకటాలను ప్రదర్శించాలని చేసిన విజ్ఞప్తిని రక్షణ శాఖ తిరస్కరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్​ ప్రధానిని కోరినప్పటికీ.. నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. బంగాల్ శకటాన్ని 2016, 2017, 2019, 2021 గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించామని, ఈ సారి 12 రాష్ట్రాలకే ఆ అవకాశం కల్పిస్తున్నామని రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్.. మమతా బెనర్జీకి లేఖ ద్వారా సమాధానమిచ్చారు. ఇదే తరహాలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​ కూడా లేఖ పంపారు రాజ్​నాథ్​.

Republic day tableau 2022

ఈ ఏడాది జరిగే గణతంత్ర వేడుకల్లో 12 రాష్ట్రాలు, 9 కేంద్ర శాఖలకు చెందిన శకటాలను మాత్రమే ప్రదర్శిస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌, హరియాణా, గోవా, గుజరాత్‌, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రత్యేకతలకు సంబంధించిన శకటాలు ప్రదర్శిస్తాయి. ఈ సారి కూడా శకటాల ప్రదర్శనకు తెలుగు రాష్ట్రాలకు అవకాశం లభించలేదు. విద్యా-నైపుణ్యాభివృద్ధి, విమానయానం, తపాలా, హోం, జలశక్తి, సాంస్కృతిక శాఖల శకటాలకు అవకాశం ఇస్తున్నట్లు రక్షణశాఖ పేర్కొంది. మొత్తం 56 శకటాలకు ప్రతిపాదనలు రాగా.. 21 శకటాలను ఖరారు చేసినట్లు వెల్లడించింది.

Beating retreat

1000 డ్రోన్లతో ప్రదర్శన..

గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించే బీటింగ్ రిట్రీట్​లో ఈసారి 1000 డ్రోన్లతో ప్రదర్శన ఉండనుంది. ఐఐటీ దిల్లీకి చెందిన ఓ అంకుర సంస్థ దిన్నీ నిర్వహించనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంగా ఈ ప్రదర్శనను రూపొందిస్తున్నారు. అంతేకాకుండా తొలిసారి నార్త్ బ్లాక్​, సౌత్ బ్లాక్​ గోడలపై లేజర్ షో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బీటింగ్ రిట్రీట్లో డ్రోన్ల ప్రదర్శన, లేజర్​ షో ఉండటం ఇదే మొట్టమొదటి సారి అని పేర్కొన్నారు. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించాయి. ఇప్పుడు ఆ జాబితాలో చేరిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.

బీటింగ్​ రిట్రీట్​లో త్రివిధ దళాలు బ్యాండ్​తో ప్రదర్శన చేస్తాయి. గణతంత్ర వేడుకల చివరిరోజున ఈ కార్యక్రమం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి జనవరి 29న బీటింగ్​ రిట్రీట్​ జరగనుంది.

అతిథులు లేకుండా..

భారత్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి గణతంత్ర వేడుకలకు మధ్య ఆసియా దేశాల అధినేతలు ఎవరూ హాజరుకావడం లేదని అధికారులు తెలిపారు. ఉజ్బెకిస్థాన్, కిర్​గిజ్​స్థాన్​, టర్క్​మెనిస్థాన్, కజఖ్​స్థాన్​, టజికిస్థాన్ దేశాలకు గతేడాదే భారత్ ఆహ్వానం పంపినప్పటికీ.. కరోనా కారణంగా నిర్ణయం మార్చుకుంది. ఈ దేశాలతో భారత్​కు శతాబ్దాల అనుబంధం ఉంది. ఆర్థిక, ఔషధ, పర్యటక, దౌత్య సంబంధాల్లో ప్రత్యేక అనుబంధం కొనసాగిస్తోంది.

ఇదీ చదవండి:డిజిటల్​ పంచ్​లు.. పేరడీ పాటలు.. ఐదు రాష్ట్రాల్లో నయా రాజకీయం!

ABOUT THE AUTHOR

...view details