మనం చాలా పెట్రోల్ బంక్‌లను చూసి ఉంటాం. కానీ అమర వీరుల స్మారకార్థం జ్యోతి వెలిగించి దేశభక్తి ఉట్టిపడేలా ఉండే పెట్రోల్ బంక్‌ను ఎప్పుడైనా చూశారా?.. వినూత్న రీతిలో అలాంటి పెట్రోల్ బంక్‌ను ఛత్తీస్‌గఢ్‌లో స్థాపించి అమరజవాన్ల త్యాగానికి నివాళులర్పిస్తున్నారు. ఈ పెట్రోల్ బంక్‌లో వచ్చిన ఆదాయాన్ని అమర వీరుల కుటుంబాలకు అందిస్తున్నారు. రెండేళ్ల క్రితం అమర జవాన్ షాహీద్ పెట్రోల్ బంక్ పేరుతో ప్రారంభించిన ఈ బంక్‌లో త్రివర్ణ పతాకంతోపాటు అమర జవాన్ల త్యాగానికి ప్రతీకగా ఓ జ్యోతి వెలిగించి ఉంటుంది. రాయ్‌పుర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ధర్శివాన్ గ్రామంలో ఈ బంక్ ఉంది. అక్కడ పెట్రోల్ కొట్టించుకునేందుకు వచ్చే కస్టమర్లకు ఉచితంగా టీ, కాఫీలను అందిస్తారు. వీటితోపాటు వారి వాహనాలను కూడా ఉచితంగా కడుగుతారు.
ఆదర్శ పెట్రోల్ బంక్.. ఆదాయంతో అమరవీరుల కుటుంబాలకు సాయం.. పిల్లల చదువు కోసం.. - ఛత్తీస్‌గఢ్ పెట్రోల్ బంక్ న్యూస్
వినూత్న రీతిలో పెట్రోల్ బంక్‌ను ప్రారంభించి అందులో వచ్చే ఆదాయాన్ని అమరవీరుల కుటుంబాలకు అందిస్తున్నారు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యక్తి. అమరవీరుల పిల్లల చదువు, పెళ్లి కోసం సహాయపడుతున్నారు. దాంతోపాటు పెట్రోల్ కొట్టించేందుకు వచ్చిన కస్టమర్లకు ఉచితంగా టీ, కాఫీలను సైతం అందిస్తున్నారు. మరి ఆ పెట్రోల్ బంక్ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..
"ప్రజల భద్రత కోసం జవాన్లు 24 గంటలు కృషి చేస్తారు. అలాంటి వాళ్లు చనిపోతే వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవటం ప్రతి పౌరుడి కర్తవ్యం. అందుకే మేము ఈ పెట్రోల్ బంక్ స్థాపించి అందులో వచ్చిన ఆదాయం నుంచి ఖర్చులన్నింటినీ తీసివేసి మిగిలిన మెుత్తాన్ని అమర జవాన్ల కుటుంబాలకు అందజేస్తాం. వీరమరణం పొందిన జవాన్ల పిల్లల పెళ్లి, చదువు కోసం ఈ సొమ్మును ఖర్చు చేస్తాం. ఉన్నత స్థాయి చదువులు చదువుతున్న పిల్లల ఫీజులను నేరుగా ఇన్స్టిట్యూట్కు చెల్లిస్తాం. ఈ నగదును వారి కుటుంబాలకు కూడా అందించకుండా ఆర్టీజీఎస్ ద్వారా నేరుగా బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. ఇలా మేము ఇప్పటికి ఒక్కో పిల్లాడికి లక్ష నుంచి రెండు లక్షల దాకా నాలుగైదు కుటుంబాల పిల్లల ఫీజులు కట్టాం. అందుకే దీనికి అమర జవాన్ షాహీద్ పెట్రోల్ బంక్ అని పేరు పెట్టాం".
- హరీశ్ భాయ్ జోషీ, అమర జవాన్ జ్యోతి ఫ్యూయెల్స్ డైరెక్టర్
భవిష్యత్తులో వారు రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నారు. ఆ రెస్టారెంట్‌కు అమర జవాన్ కోటి అనే పేరుతో దేశంలోని సైనికులు, పోలీసు సిబ్బందికి ఉచితంగా భోజనాన్ని అందించాలనుకుంటున్నారు.