దేశ రాజధానిలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. టీకా పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నిబంధనలను సడలించాలని, వ్యాక్సిన్ పొందేందుకు కనీస వయస్సును తొలగించాలని కోరారు.
కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు వస్తే.. నగర ప్రజలందరికీ మూడు నెలల్లో టీకా అందిస్తామని పునరుద్ఘాటించారు కేజ్రీవాల్.
" దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల కొత్త సవాళ్లను, ఆందోళనను పెంచుతోంది. మరింత వేగంగా వ్యాక్సినేషన్‌ను కొనసాగించాలనుకుంటున్నాం. కొత్త కేంద్రాల ఏర్పాటు నిబంధనలు సడలింపు చేసి, ప్రతి ఒక్కరిని టీకా వేసుకునేందుకు అనుమతిస్తే.. దిల్లీ ప్రభుత్వం నగర పౌరులకు మూడు నెలల్లో వ్యాక్సిన్ అందిస్తుంది. అందుకు తగినట్లుగా సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుత తరుణంలో మరింత వేగంగా వ్యాక్సినేషన్ చేపట్టాల్సిన అవసరం ఉంది. మా ఆందోళనను ప్రధాని అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. "