బిహార్ ముజఫర్‌పుర్ జిల్లాలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ యువకుడిని.. తాను ప్రేమించిన యువతి సోదరులే అతి కిరాతకంగా హత్య చేశారు. దాంతో ఆగ్రహానికి గురైన బాధితుడి కుటుంబ సభ్యులు.. అతడి మృతదేహాన్ని నిందితుడి ఇంటి ముందే దహనం చేశారు.
అసలేం జరిగింది?
ముజఫర్‌పుర్ జిల్లా.. రామ్పురుశాహ్ ప్రాంతానికి చెందిన సౌరభ్‌రాజ్(22).. సోనావర్ష గ్రామానికి చెందిన ఓ యవతి ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమను వ్యతిరేకించిన యవతి సోదరులు దారుణానికి ఒడిగట్టారు. తన ప్రేయసి పిలుస్తున్నట్లుగా నమ్మించి సౌరభ్‌ను తమ ఇంటి వద్దకు పిలిపించారు. అనంతరం.. అతడ్ని గదిలో బంధించి తీవ్రంగా దాడి చేశారు.
అంతేకాకుండా.. సౌరభ్ మర్మాంగం కోసి చిత్రహింసలకు పాల్పడ్డారు. దాంతో తీవ్ర రక్తస్రావం కాగా చనిపోతాడని భావించిన నిందితులు.. సౌరభ్‌ను ఓ ఆస్పత్రిలో చేర్చి పరారయ్యారు. అయితే.. అక్కడే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
సౌరభ్ మృతితో అతడి కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో అతని గ్రామస్థులంతా ఆగ్రహానికి గురయ్యారు. సౌరభ్ మృతదేహానికి పోలీసులు పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం.. అతడి మృతదేహాన్ని నిందితుడి ఇంటి ముందుకు తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని ఆ ఇంటివద్దే దహనం చేశారు. ఈ ఘటనలో పోలీసులు.. పలువురిపై కేసు నమోదు చేశారు. ఉద్రిక్తతలు నెలకొనగా.. పోలీసులు భారీగా మోహరించారు.