దేశవ్యాప్తంగా సోమవారం నుంచి రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. 60 ఏళ్లు పైబడిన వారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్కుల్లో దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడే వారికి టీకా పంపిణీ చేయనున్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి కొవిన్ యాప్ 2.0లో వ్యాక్సిన్ కోసం పేరు నమోదు చేసుకోవచ్చని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ యాప్ సాయంతో లబ్ధిదారులు ఎక్కడనుంచైనా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పింది.
ఓటీపీ ద్వారా..
కొవిన్ 2.0 యాప్‌లో వివరాలు నమోదు చేసిన తర్వాత సెల్‌ఫోన్‌కు ఏ తేదీన, ఏ కేంద్రానికి వెళ్లాలో ఎస్ఎంఎస్ వస్తుంది. మొదటి డోసు తీసుకున్నప్పుడే రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలో తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ సమయంలో మొబైల్ నంబర్‌ను ధ్రువీకరించేందుకు సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఒకే మొబైల్ నంబర్‌తో నలుగురు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఫోన్ నంబర్ మినహా మరే ఇతర వివరాలు ఒకే విధంగా ఉండకూడదు.