ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తమిళనాడుకు చెందిన డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కజగం) పార్టీకి భారీగా విరాళాలు అందాయి. 2021-22 మధ్య దేశంలోని ప్రాంతీయ పార్టీలలో డీఎంకే పార్టీ రూ.318 కోట్ల విరాళాలతో అగ్రస్థానంలో నిలిచింది. రూ.307 కోట్లతో ఒడిశాకు చెందిన బీజేడీ(బిజూ జనతా దళ్), రూ. 218 కోట్లతో బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి) తర్వాత స్థానంలో ఉన్నాయి. ఈ మేరకు దేశంలోని 10 ప్రాంతీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా.. రూ.852 కోట్ల విరాళాలు వచ్చినట్టు.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) గణాంకాలు వెల్లడించాయి.
2021- 22 ఏడాదిలో డీఎంకే, బీడేడీ, వైకాపా, భారాస, జేడీయూ వంటి 10 ప్రాంతీయ పార్టీలకు పెద్ద మెుత్తంలో విరాళాలు వచ్చినట్లు.. ఏడీఆర్ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 36 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.1213 కోట్లు అని ఏడీఆర్ చెప్పింది. ఈ మేరకు రాజకీయ పార్టీ ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నాయని తెలిపింది. ఇక, ఏడీఆర్ విశ్లేషణల ప్రకారం అన్ని పార్టీల ఆదాయంలో డీఎంకే వాటా 26.27 శాతంగా ఉంది. ఇక, టాప్ 5 పార్టీల ఆదాయం లెక్కేస్తే.. రూ.1024.42 కోట్లు అని.. ఇది మొత్తం విరాళాల్లో 84.44 శాతమని ఏడీఆర్ పేర్కొంది.