తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బలమైన ప్రభుత్వమంటే నియంత్రించడం కాదు: మోదీ - అన్నా విశ్వవిద్యాలయం స్టాలిన్

PM MODI CHENNAI VISIT: యువత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేలా కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయం 42వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. తమ హయాంలోని బలమైన ప్రభుత్వం దేన్నీ నియంత్రించదని పేర్కొన్నారు. కరోనా ప్రభావం ప్రతి దేశంపైనా పడిందని.. భారత్‌ దాన్నుంచి బయటపడేందుకు శాస్త్రవేత్తలు, నిపుణులు, ప్రజలు తోడ్పడ్డారని తెలిపారు.

modi stalin
మోదీ స్టాలిన్

By

Published : Jul 30, 2022, 7:42 AM IST

Updated : Jul 30, 2022, 8:00 AM IST

PM MODI CHENNAI VISIT: గతంలో బలమైన ప్రభుత్వమంటే ప్రతి దానిని, ప్రతి ఒక్కరిని నియంత్రించాలనేలా ఉండేదని, ఆ పద్ధతిని తాము మార్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వ్యవస్థల్లో జోక్యం చేసుకోవడమనే అపప్రధను తాము తొలగించామని వివరించారు. 'మా హయాంలోని బలమైన ప్రభుత్వం ఎవరినీ, దేన్నీ నియంత్రించదు. బలమైన ప్రభుత్వం మిమ్మల్ని అడ్డుకోదు. బాధ్యతగా ప్రతిస్పందిస్తుంది. ఇలా ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేలా సంస్కరణలు తీసుకొచ్చాం' అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. యువత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేలా కొత్త విద్యావిధానం తీసుకొచ్చామని తెలిపారు. శుక్రవారం చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయం 42వ స్నాతకోత్సవంలో ఆయన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువతకు, విద్యార్థులకు దేశంలో ఇప్పుడెన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సాంకేతిక ఆవిష్కరణల కోసం దేశం ఎదురుచూస్తోందని చెప్పారు. డిజిటల్‌ లావాదేవీల్లో ప్రపంచానికి భారత్‌ నాయకత్వం వహిస్తోందన్నారు. ఇప్పుడు యువత కొత్త ఆలోచనలతో స్టార్టప్‌లను పెట్టే దిశగా వెళ్తున్నారని తెలిపారు.

ప్రపంచమే ఇటు చూస్తోంది..
స్వామి వివేకానంద భారత భవిష్యత్తు ఆశ యువతే అని చెప్పారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. దానికి తగ్గట్లుగా ఇప్పుడు వారి పనితీరు ఉందని.. ప్రపంచమే వారి వైపు చూస్తోందన్నారు. ఇది గొప్ప గౌరవమని పేర్కొన్నారు. కరోనా ప్రభావం ప్రతి దేశంపైనా పడిందని.. భారత్‌ దాన్నుంచి బయటపడేందుకు శాస్త్రవేత్తలు, నిపుణులు, ప్రజలు తోడ్పడ్డారని తెలిపారు. ఇప్పుడు పారిశ్రామిక, ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగాల్లో భారత్‌ ముందుందని చెప్పారు. ప్రత్యేకించి మొబైల్స్‌ తయారీలో మొదటి స్థానానికి వచ్చిందన్నారు. ఐదేళ్లలో స్టార్టప్‌లు భారీగా పెరిగాయని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో వాటి సంఖ్య 73,000కు చేరుకుందని ప్రధాని తెలిపారు. గతేడాది ఎఫ్‌డీఐలపరంగా రికార్డు స్థాయిలో 83 బిలియన్‌ డాలర్లను సాధించామని, కరోనా తర్వాత స్టార్టప్‌లలో రికార్డు స్థాయి పెట్టుబడులు వచ్చాయన్నారు. వచ్చే 25 ఏళ్లు అమృతకాలంగా భావించాలని, వందేళ్ల స్వాతంత్య్ర వేడుకలు వచ్చేసరికి యువత కొత్త భవిష్యత్తును దేశానికి ఇవ్వాలని పిలుపునిచ్చారు. 'మీ ప్రగతి, భారత అభివృద్ధి.. మీ విజయం, దేశ విజయం. దీనికి తగ్గట్లు ఆలోచనలు ప్రారంభించండి' అని పిలుపునిచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సెమి కండక్టర్లు, ఇ-వాహనాలు, లిథియం అయాన్‌ బ్యాటరీలు, సోలార్‌ ఫొటోవొల్టాయిక్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌, డేటా సెంటర్‌ వంటి రంగాలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి తదితరులు పాల్గొన్నారు.

Last Updated : Jul 30, 2022, 8:00 AM IST

ABOUT THE AUTHOR

...view details