కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని(Covishield dose gap) తగ్గించడంపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సాంకేతిక సలహా మండలిలోని నిపుణులు దీనిపై చర్చించనున్నట్లు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనకు నిపుణులు సానుకూలత వ్యక్తం చేస్తే.. డోసుల మధ్య వ్యవధి తగ్గనుంది.
కొవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధిని పెంచుతూ గతంలో నిర్ణయం తీసుకుంది కేంద్రం. అప్పటివరకు ఉన్న 6-8 వారాల వ్యవధిని.. 12-16 వారాలకు పెంచింది. డోసుల మధ్య వ్యవధి పెంచడం వల్ల వ్యాక్సిన్‌తో మెరుగైన ఫలితాలు లభిస్తాయని నేషనల్ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(NTAGI) నిపుణుల బృందం చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంది.
'ప్రతిపాదన లేదు'
అయితే, డోసుల వ్యవధి పెంచే ప్రతిపాదనలేవీ ఇంకా తమ వద్దకు రాలేదని నిపుణుల బృందం(NTAGI) చీఫ్ డాక్టర్ ఎన్కే అరోడా చెప్పారు. కొవిషీల్డ్‌తో పాటు కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ టీకాలకూ డోసుల వ్యవధిని మార్చాలనే ఉద్దేశం లేదని అన్నారు. ప్రస్తుతం టీకా సమర్థతను అంచనా వేసే డేటా సేకరణ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. టీకాల సమర్థతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు తెలిపారు.