తీహాడ్ జైలులో ఉన్న దిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ బయట నుంచి తెప్పించుకున్న ఆహారం తింటున్న వీడియో వెలుగులోకి వచ్చింది. జైన్‌కు మతవిశ్వాసాల ప్రకారం ఆహారం అందించడంలేదని ఆయన తరఫు న్యాయవాది దిల్లీ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ వీడియో ప్రాధాన్యం సంతరించుకుంది. సరైన ఆహారం అందక మంత్రి 28 కేజీల బరువు తగ్గారని ఆయన న్యాయవాది ఇర్షాద్ పేర్కొన్నారు. జైన మతం ఆచరించే సత్యేంద్ర.. వండిన ఆహారం, ధాన్యాలు, పాలపదార్థాలు తీసుకోరని ఆయన న్యాయవాది తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పండ్లు, కూరగాయలు, విత్తనాలు, డ్రైఫ్రూట్స్, ఖర్జూరం మాత్రమే తీసుకుంటారని వివరించారు. ఆ ఆహారాన్ని జైలు వర్గాలు నిలిపివేశాయని పేర్కొన్నారు. ఆయనకు వెన్ను సంబంధిత సమస్యలు సహా అనేక రుగ్మతలు ఉన్నట్లు వివరించారు. ఈ పిటిషన్ నేపథ్యంలో జైన్ తన మత విశ్వాసం ప్రకారం తీసుకునే ఆహారం తింటున్న దృశ్యాలు బయటకొచ్చాయి.
మరో వైపు "సత్యేందర్ జైన్‌కు ఇంతకు ముందు ఎలాంటి ఆహారం అందించారు? ఇప్పుడు ఎలాంటి ఆహారాన్ని ఇస్తున్నారు? ఆయనకు అక్టోబర్ 21న ఎమ్ఆర్ఐ స్కాన్ చేయాల్సి ఉండగా.. అది ఎందుకు కుదరలేదు? జైన్ దరఖాస్తుకు సంబంధించి, ఈ ప్రశ్నలకు సమాధానాలు పంపించండి" అని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. అయితే సత్యేంద్ర తీహాడ్ జైలులో ఉన్నప్పటికీ ఆయన బరువు 8 కేజీలు పెరిగిందని కారాగారం వర్గాలు చెప్పాయి.