Raghuram rajan news: ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని, అందులోని సంస్థల్ని బలోపేతం చేయడంలోనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఆర్థిక పురోగతికి ఇది ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఒక విభాగమైన 'ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్' రాయ్‌పూర్‌లో నిర్వహించిన ఐదో వార్షికోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మెజారిటీవాదం బలపడి.. ఒకదేశ రాజకీయ నాయకులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగ సంక్షోభాన్ని కప్పిపుచ్చుకోవాలనుకుంటే శ్రీలంక తరహా పరిస్థితులు తలెత్తుతాయని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరులుగా చూపించే ప్రయత్నం చేస్తే అది దేశాన్నే విభజిస్తుందని వ్యాఖ్యానించారు. ఫలితంగా దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం కూడా చోటుచేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. "భారత ఆర్థిక వృద్ధికి ఉదారవాద ప్రజాస్వామ్య అవసరమెంత" అనే అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.