దిల్లీలోని ఎర్రకోటను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. జులై 21 నుంచి ఆగస్టు 15 వరకు పర్యటకులు ఎవరికీ అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఎర్రకోటను పర్యవేక్షించే పురాతత్వ శాఖ ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.
అప్పటి నుంచే ఆంక్షలు...
జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట తీవ్రస్థాయిలో హింసకు వేదికైంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన నిరసన అదుపు తప్పగా.. ఎర్రకోట వద్ద గందరగోళం నెలకొంది. ఫలితంగా అధికారులు పర్యటకులను కొంతకాలంపాటు అనుమతించరాదని నిర్ణయించారు. తర్వాత కరోనా రెండో దశ వ్యాప్తి దృష్ట్యా ఆ ఆంక్షలను మరికొంతకాలం కొనసాగించారు. జూన్ 16 నుంచి ఎర్రకోటకు పర్యటకుల్ని అనుమతిస్తున్నారు.
డ్రోన్ దాడుల ముప్పు!
మరోవైపు... దిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవం ముందు ఉగ్రదాడి జరిగే ప్రమాదముందన్న నిఘా వర్గాల హెచ్చరికతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. జమ్ముకశ్మీర్‌లో భారత వాయుసేనకు చెందిన వైమానిక స్థావరంపై ఇటీవల విద్రోహ డ్రోన్ దాడి జరిగింది. అదే తరహాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లతో ఈసారి దిల్లీపై విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు నిఘావర్గాల సమాచారం. ఈ మేరకు భద్రతా సంస్థలు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి.
ఇంటెలిజెన్స్ విభాగం సహా నగరంలోని పోలీస్ ఠాణాలను దిల్లీ పోలీస్ కమిషనర్ బాలాజీ శ్రీవాస్తవ అప్రమత్తం చేశారు. డ్రోన్ దాడులకు అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని ఆదేశించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను సైతం పోలీసులు ఏర్పాటు చేశారు. చారిత్రక ఎర్రకోట వద్ద నాలుగు యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. విద్రోహ డ్రోన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకు పోలీసులు, భద్రతా దళాలకు తొలిసారిగా శిక్షణ ఇస్తున్నారు.
ఇదీ చూడండి:'ఎర్రకోట ఘటనకు నేను బాధ్యుడిని కాదు'