Red Ants Panic In Odisha: ఒడిశాలో ఎర్ర చీమలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చంద్రదేయ్‌పూర్‌లోని బ్రహ్మణసాహి గ్రామంలోకి లక్షలాది విషపూరిత ఎర్ర చీమలు వచ్చి చేరాయి. వేలాది చీమలు ఒక్కసారిగా ఇళ్లలోకి చేరి కుడుతుండడం వల్ల కాళ్లవాపు, దురదతో గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు నెలలుగా ఎర్రచీమల తాకిడితో అవస్థలు పడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
చీమలు మొదట ఇళ్లలోకి వచ్చినప్పుడు గ్రామస్థులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ క్రమంగా వాటి సంఖ్య పెరుగుతోంది. అలాగే మనుషులపై ఎక్కువగా దాడి చేస్తుండడం వల్ల భయాందోళనకు గురవుతున్నారు. ఎర్రచీమల బెడద భరించలేక కొందరు గ్రామస్థులు ఇప్పటికే వేరే ప్రాంతానికి వలస వెళ్లారు. చీమల నివారణకు క్రిమిసంహారక మందులు వాడినప్పటికీ ప్రయోజం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికే అనేక ఇళ్లలోని మట్టిగొడల్లో అవి తిష్టవేశాయి. రెండు నెలలుగా చీమలు గ్రామస్థులకు చుక్కలు చూపిస్తున్నాయి.
తమిళనాడులోని అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాలపై సైతం ఇటీవల చీమల దండు వీరవిహారం చేసింది. 'ఎల్లో క్రేజీ యాంట్స్’ అని పిలిచే ఆ చీమలు దిండుక్కల్ జిల్లా కరంతమలై రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లోని సుమారు ఏడు గ్రామాలపై దండయాత్ర చేశాయి. పంటపొలాల్ని నాశనం చేస్తుండడం, రైతులకు చెందిన మేకలు, పశువులు, ఎద్దులకు హాని చేస్తున్నాయి. ఎలుకలు, పిల్లులు, కుందేళ్లనూ స్వాహా చేస్తున్నాయి. పాములు, బల్లులను గుంపులుగా చుట్టుముట్టి అవలీలగా భోంచేస్తున్నాయి.