Recycling Bottles Into Synthetic Yarn: వాడిపారేసిన ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేసి.. అందమైన సింథటిక్ నూలు వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ టెక్స్టైల్ రంగంలో సంచలనంగా మారింది సులోచన కాటన్ కంపెనీ. తమిళనాడులోని తిరుపుర్కు చెందిన ఈ కంపెనీ.. ప్లాస్టిక్ వ్యర్థాలతో దారాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతోంది. పత్తికి ప్రత్యామ్నాయంగా సింథటిక్ నూలును ఉత్పత్తి చేసి టెక్స్టైల్ రంగంలోని వారిని తమవైపు తిప్పుకుంటోంది. రోజుకు 70 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేస్తున్న ఈ కంపెనీ... అత్యాధునిక పరికరాల సాయంతో వస్త్రాలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది.
సులోచన కాటన్ కంపెనీలో ముందుగా.. సేకరించిన ప్లాస్టిక్ బాటిళ్లను ఒక స్ట్రేటర్ మెషీన్‌తో చిన్న చిన్న ఫ్లేక్స్(ముక్కలు)గా కట్ చేస్తారు. వాటిని శుభ్రం చేసి అరబెట్టి.. సింథటిక్ ఫైబర్లుగా మార్చే యంత్రాల్లోకి పంపిస్తారు. తరవాత వివిధ దశల్లో నూలుగా మారుస్తారు. మొత్తం 70 వర్ణాల్లో ఈ దారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నూలు దారాలతో కంపెనీలోనే వివిధ రకాల వస్త్రాలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 70 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లతో రోజుకు 110 టన్నుల సింథటిక్ దారాన్ని తయారు చేస్తున్నారు. సుమారు 20 నుంచి 40 ప్లాస్టిక్ బాటిళ్లతో ఒక టీ షర్టును తయారు చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
"నీటితో పని లేకుండా డోప్ డైయింగ్ పద్ధతి ద్వారా సింథటిక్ దారాలను తయారు చేస్తున్నాం. దీని ద్వారా అనేక ప్రయోజనాలతో పాటు ఉత్పత్తి ఖర్చు కూడా తగ్గుతుంది. సాధారణంగా పాలిస్టర్ దారలను తయారు చేయటానికి చాలా ఖర్చు అవుతుంది. మేము రోజుకు 20,000 కిలోల నూలు ఉత్పత్తి చేస్తున్నాం. దాన్ని అమెరికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తున్నాం."