దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌తో పాటు ఆయన సన్నిహితుల నివాసాల్లో జరిగిన సోదాల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. సత్యేంద్ర జైన్ ఇంట్లో 2.82 కోట్ల రూపాయల నగదు, 1.80 కిలోల బరువున్న 133 బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇతర పత్రాలను, డిజిటల్ రికార్డులను సీజ్ చేసినట్లు చెప్పింది. విచారణ కొనసాగుతోందని ఈడీ వివరించింది.
స్వాధీనం చేసుకున్న బంగారు నాణేలు దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంట్లో జరిగిన ఈడీ దాడులను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఆయనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని చెప్పారు. ప్రధాని మోదీతో దర్యాప్తు సంస్థలు ఉండొచ్చని.. కానీ తమతో దైవం ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు కౌంటర్: ఈడీ సోదాలపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు కౌంటర్ ఇచ్చాయి. రానున్న రోజుల్లో మరిన్ని పేర్లు బయటకు వస్తాయని ఆరోపించాయి. ఈ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా విచారించాలని భాజపా డిమాండ్ చేసింది. ఈ కేసుతో ఆయనకు కూడా సంబంధం ఉందని.. అందుకే జైన్‌కు క్లీన్చిట్ ఇచ్చారని ఆరోపించింది. ఈ కేసులో మరిన్ని పేర్లు బయటకు వస్తాయని.. తర్వాత విచారణ ఎదుర్కొనేది మనీశ్ సిసోడియా అని కాంగ్రెస్ విమర్శించింది.
కోల్‌కతా కేంద్రంగా పనిచేసే ఓ సంస్థతో సంబంధమున్న హవాలా కేసులో ఆయన్ను మే 30న ఈడీ అదుపులోకి తీసుకుంది. జైన్ కుటుంబం, కంపెనీలకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు గత నెలలో ఈడీ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి 2018లోనే సత్యేంద్రను ప్రశ్నించింది ఈడీ.
ఇదీ చదవండి:'సీఎం వల్లే నేను బంగారం స్మగ్లింగ్ చేయాల్సి వచ్చింది'