తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మైనర్​పై రెండేళ్లుగా రేప్.. దోషికి 142ఏళ్ల శిక్ష.. పోక్సో కోర్టు సంచలన తీర్పు

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఓ వ్యక్తికి 142ఏళ్ల కఠిన శిక్ష విధించింది పోక్సో కోర్టు. రూ.5లక్షల జరిమానా సైతం విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Record punishment in POCSO case in Kerala
Record punishment in POCSO case in Kerala

By

Published : Oct 1, 2022, 10:10 AM IST

Updated : Oct 1, 2022, 12:31 PM IST

పోక్సో కేసులో ఓ స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాలికపై రెండేళ్ల పాటు అత్యాచారం చేసిన 41ఏళ్ల వ్యక్తికి 142 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. పతనంతిట్ట అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు(ప్రిన్సిపల్ పోక్సో) జడ్జి జయకుమార్ జాన్ ఈ మేరకు తీర్పు చెప్పారు. నిందితుడు ఆనందన్ పీఆర్​కు శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా విధించారు. ఈమేరకు ప్రకటన విడుదల చేసిన పోలీసులు.. జిల్లాలో ఓ పోక్సో కేసులో విధించిన రికార్డు స్థాయి శిక్ష ఇదేనని తెలిపారు. కోర్టు 142 ఏళ్లు శిక్ష విధించినప్పటికీ.. నిందితుడు మరో 60 ఏళ్లు జైలులో ఉంటాడని ప్రకటనలో పేర్కొన్నారు.

బాధితురాలు వయసు పదేళ్లు అని పోలీసులు తెలిపారు. నిందితుడు ఆమెకు బంధువేనని చెప్పారు. నిందితుడు బాలిక కుటుంబంతో ఉండేవాడు. ఈ సమయంలోనే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 2019 నుంచి 2021 వరకు బాలికపై లైంగిక దాడులకు పాల్పడేవాడని కోర్టు నిర్ధరించింది. ఈమేరకు పోక్సో, ఐపీసీ 506 సెక్షన్ ప్రకారం నమోదైన కేసులపై అతడికి శిక్ష విధించింది. రూ.5లక్షల జరిమానా చెల్లించకపోతే.. మరో మూడేళ్లు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. తిరువళ్ల పోలీస్ స్టేషన్ ఇన్​స్పెక్టర్ హరిలాల్.. ఈ ఘటనపై దర్యాప్తు చేసుకొని ఛార్జ్​షీట్ దాఖలు చేశారు.

భార్య, కుమార్తెలను పారతో కొట్టి చంపాడు
గదిలో నీళ్లు ఆగిపోయాయన్న కోపంతో ఓ వ్యక్తి భార్యను, పద్నాలుగేళ్ల కుమార్తెను పారతో కొట్టి హత్య చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌ జిల్లా నంద్‌గ్రామ్‌ పోలీస్‌స్టేషను పరిధిలో ఈ దారుణం జరిగింది. సిహానీ చుంగీ ప్రాంతంలోని సందీప్‌ నగర్‌లో ఉన్న ఇంటిలో ఈ హత్యలు జరగడంతో పోలీసులు భర్తను అరెస్టు చేశారు. ఇలా జరిగినప్పటి నుంచీ ఆ దంపతుల కుమారుడు (17) కనిపించడం లేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మైనర్​పై 8 మంది అత్యాచారం...
రాజస్థాన్ అల్వార్​లో ఓ మైనర్​పై సామూహిక అత్యాచారం జరిగింది. ఎనిమిది మంది కలిసి బాలికపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. గత తొమ్మిది నెలలుగా ఈ దారుణం కొనసాగుతోందని చెప్పారు. బాలిక రహస్య చిత్రాలను చిత్రీకరించి ఆమెను ట్రాప్ చేశారు నిందితులు. వాటితో బ్లాక్​మెయిల్ చేసి.. వేలల్లో డబ్బును దండుకున్నారు. చివరకు ధైర్యం చేసిన బాధితురాలు.. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల ఇళ్లలో సోదాలు చేసినట్లు చెప్పారు.

2021 డిసెంబర్ 21న తనను నిందితులు పిలిచారని, అక్కడే తనపై అఘాయిత్యానికి ఒడిగట్టారని బాలిక వివరించింది. గంటల పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమె.. చివరకు స్పృహలోకి వచ్చి ఇంటికి చేరుకుంది. అయితే, నిందితులు అప్పటి నుంచి ఆమెను బ్లాక్​మెయిల్ చేయడం ప్రారంభించారు. అత్యాచారం చేసినప్పుడు తీసిన వీడియోలను వైరల్ చేస్తామని బెదిరించారు. బాలికను భయపెట్టి.. మొత్తంగా రూ.50వేలు తీసుకున్నారు. ఆ తర్వాత 2022 జనవరి 3న, ఏప్రిల్ 6న సైతం ఆమెపై రేప్ చేశారు.

ఆ తర్వాత బాలిక నుంచి రూ.2.5 లక్షలు డిమాండ్ చేశారు. ఇంత మొత్తాన్ని ఇవ్వలేనని బాలిక తెగేసి చెప్పింది. దీంతో ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్​లోడ్ చేశారు నిందితులు. ఇవి కుటుంబ సభ్యుల వరకు చేరాయి. దీంతో బాధితురాలు విషయం మొత్తం వారికి చెప్పింది. కుటుంబ సభ్యుల సాయంతో పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించింది. నిందితులను నఫీజ్, కల్లూ, ఆయుబ్, షర్ఫు, సాబ్బు, సులేమాన్, ఉమర్, రఫీక్​గా గుర్తించారు.

మంత్రాల నెపంతో మహిళపై దారుణం..
మంత్రాలు చేస్తోందన్న అనుమానంతో బిహార్ దర్భంగాలో ఓ మహిళను స్థానికులు తీవ్రంగా కొట్టారు. రెండున్నరేళ్ల చిన్నారిని మహిళ బలి ఇచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో నుంచి ఆమెను బయటకు లాగి చిత్రహింసలు పెట్టారు. అనంతరం ఓ స్తంభానికి మహిళను కట్టేసి వివస్త్రను చేశారు. జిల్లాలోని సాకత్​పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహిళను కొడుతున్న స్థానికులు

సోమవారం ఓ రెండున్నరేళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. స్థానికులు వెతకగా.. షేర్​పుర్ నారాయన్​పుర్ సమీపంలోని ఓ దర్గాలో చిన్నారి శవం కనిపించింది. మంత్రాలు చేస్తూ చిన్నారిని హత్య చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిందితురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నించారు. అయితే, ఆమె ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని సీనియర్ ఎస్పీ అవకాశ్ కుమార్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Last Updated : Oct 1, 2022, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details