Agneepath protest: నకిలీ జాతీయవాదులెవరో గుర్తించాలని యువతకు సూచించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారికి తమ పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అగ్నిపథ్‌ను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో దిల్లీ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నాయకులతో కలిసి సత్యాగ్రహ దీక్షలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.
'మిమ్మల్ని మించిన దేశభక్తులు లేరు. మీరు నకిలీ దేశభక్తులను గుర్తించండి. మీ పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. దేశం మొత్తం మీ వెంటే ఉంది. హింసా మార్గంలో నడిచే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించండి. నిజమైన దేశభక్తిని చూపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మీ లక్ష్యం కావాలి' అని అన్నారు ప్రియాంక గాంధీ.
మరోవైపు.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ విరుచుకుపడ్డారు. యువత పట్ల కేంద్రం మొండిగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. యువత బాధను కేంద్రం అర్థం చేసుకుని అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలు వెనక ప్రతిపక్షం ఉందని కేంద్ర ప్రభుత్వం అనడంలో అర్థం లేదని పీటీఐ ముఖాముఖిలో చెప్పారు.
వ్యవసాయ చట్టాల మాదిరిగానే అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు పైలట్. యువత భవిష్యత్‌తో ఆటలాడవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. భాజపా ప్రభుత్వం ఎవరి మాట వినడం లేదని.. దేశానికి కాపలాదారునిగా ఉంటామని మొండిగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం తన ఆలోచనలను 130 కోట్ల ప్రజలపై రుద్దడం సబబు కాదని సచిన్ పైలట్ అభిప్రాయపడ్డారు.
అగ్నిపథ్.. ఆర్‌ఎస్‌ఎస్ అజెండాలో భాగమా?:కొత్త సైనిక నియామకాల విధానం అగ్నిపథ్‌పై యువతకు అనేక సందేహాలు ఉన్నాయని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. "చదువుకున్న యువతకు అగ్నిపథ్ విధానం.. 'జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం' వంటిదా?" అని తేజస్వీ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. "లేక ఆర్‌ఎస్‌ఎస్ అజెండాలో భాగంగా దీన్ని తీసుకొచ్చారా?" అని కేంద్రాన్ని నిలదీశారు. మరోవైపు యువత శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు. వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ గురించి మాట్లాడిన ప్రభుత్వం ఇప్పుడు 'నో ర్యాంక్, నో పెన్షన్'ను అమల్లోకి తీసుకొస్తోందని ఎద్దేవా చేశారు. ఈ పథకంపై యువతకు అనేక సందేహాలున్నాయన్న ఆయన ప్రభుత్వానికి 20 ప్రశ్నలు సంధించారు. అగ్నిపథ్‌ను సైన్యంలోని ఉన్నతాధికారుల నియామకాలకు ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌పై నిరసనలు కొనసాగుతున్నాయని తేజస్వీ యాదవ్ గుర్తుచేశారు. సైనికులుగా మారాలనుకుంటున్న అనేక మందిలో ఈ కొత్త విధానం ఆగ్రహాన్ని కలగజేస్తోందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త విధానాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు బిహార్‌లో చెలరేగుతున్న హింసకు ఆర్జేడీయే కారణమన్న భాజపా ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.