Eknath Shinde Supreme Court: శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ శిందే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర రెబల్ ఎమ్మెల్యేలకు.. డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు అందించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. శివసేన శాసనసభా పక్ష నేతగా తనను తొలగిస్తూ.. అజయ్ ఛౌదరిని నియమించడాన్ని కూడా సవాల్ చేశారు శిందే.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దివాలా సభ్యులుగా గల వెకేషన్ బెంచ్.. ఈ పిటిషన్ను సోమవారం పరిశీలించే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు కొందరు శివసేన ఎమ్మెల్యేలు. పార్టీ సీనియర్ నేత, మంత్రి ఏక్నాథ్ శిందే ఈ వర్గానికి నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వీరంతా అసోం గువాహటిలోని ఓ హోటల్లో బస చేస్తున్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్ భాగస్వాములుగా ఉన్న ప్రభుత్వం నుంచి శివసేన బయటికి రావాలని డిమాండ్ చేస్తున్నారు శిందే. దీనిని వ్యతిరేకిస్తున్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. అసమ్మతివాదులు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నారు.
మహారాష్ట్ర విధానసభ సచివాలయం.. శిందే సహా 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు శనివారం అనర్హత వేటు నోటీసులు జారీ చేసింది. జూన్ 27 సాయంత్రంలోగా దీనికి రాతపూర్వక సమాధానాలు ఇవ్వాలని అందులో స్పష్టం చేసింది.