బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుత ఫలితాలను సాధించింది. ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
బిహార్‌లో సాధారణంగా నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతా దళ్ యునైటెడ్, లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ మధ్యే పోటీ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు రాష్ట్రంలో భాజపా తన స్థానాన్ని బలపరుచుకుంది. ఎంతో సంయమనం పాటిస్తూ బిహార్‌లో నెమ్మదిగా పాగా వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాకర్షణ శక్తితో పాటు జేపీ నడ్డా ప్రణాళికలతో మెరుగైన ఫలితాలు రాబట్టింది. జేడీయూ, విపక్ష కాంగ్రెస్, ఆర్జేడీని తోసిరాజని భారీ విజయాన్ని అందుకుంది.
ఫలించిన డబుల్ ఇంజిన్!
భాజపా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ప్రధాని మోదీ 12 బహిరంగ ప్రచార సభలలో పాల్గొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల కలిగే మేలును ప్రజలకు వివరించారు. ఆర్జేడీ అరాచక పాలన వల్ల సమస్యలు ఎదురయ్యాయని విమర్శలు చేశారు. ఈ ప్రచారాలు ఫలితాన్నిచ్చాయి. ప్రజల మద్దతు కూడగట్టగలిగాయి.
మరోవైపు నితీశ్ కుమార్ విషయంలో భాజపా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడుతూనే.. తన పార్టీ బలోపేతంపైనా దృష్టిసారించింది. జేడీయూ పట్ల ఉన్న అసంతృప్తి తనపై పడకుండా జాగ్రత్తపడింది.
లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) నేత చిరాగ్ పాసవాన్ వైఖరితో దళితుల ఓట్లు దూరమవుతాయన్న ఆందోళన తొలుత వ్యక్తమైంది. రాంవిలాస్ పాసవాన్ మృతితో సానుభూతి ఓట్లు ఎల్జేపీకి వెళ్తాయన్న అనుమానాలు కలిగాయి. అయితే జీతన్‌రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ ఆవామ్ మోర్చా ఎన్డీఏతోనే ఉండటం భాజపాకు కలిసొచ్చింది. దళితుల ఓట్లను కాపాడుకోగలిగింది. మరోవైపు ఎల్జేపీ వేరుగా పోటీ చేసి ఓట్లు చీల్చడమూ భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించేందుకు కారణమైంది.
ఎల్జేపీ- కాషాయ వ్యూహం?
ఎన్డీఏ నుంచి వైదొలగాలనే చిరాగ్ పాసవాన్ నిర్ణయం వెనుక భాజపా పెద్దలు ఉన్నారనే వార్తలు ముందు నుంచీ వినిపించాయి. జేడీయూ అభ్యర్థులను ఓడించి అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించి సీఎం పీఠాన్ని అధిష్ఠించాలన్నదే కమలనాథుల వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినా.. భాజపా నాయకత్వానికి కట్టుబడి ఉంటామని ప్రకటించడం వెనక రహస్యం దాగి ఉందని చెబుతున్నారు. ఈ వ్యూహం ఎవరిదైనా, ఇందులో ఎంత నిజం ఉన్నా.. రాష్ట్ర రాజకీయాలను భాజపా కీలక మలుపుతిప్పిందన్నది మాత్రం వాస్తవం.