తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆకాశమే హద్దు.. వాయుసేనలో మహిళల సత్తా.. యుద్ధానికీ సై అంటున్న తేజస్వీ - eastren sector iaf pilots

ఆకాశంలో ఎగరాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ ఆ కలల్ని కొందరు మాత్రమే నిజం చేస్తుంటారు. అలాంటి కోవకు చెందుతారు వాయుసేన శివంగి.. తేజస్వీ. భారత వైమానిక దళ తొలి మహిళ ఆయుధ వ్యవస్థ​ ఆపరేటర్​గా నిలిచిన తేజస్వీ... ఆకాశ వీధుల్లో విహరించడమే కాదు శత్రువులతో యుద్ధాలు చేయడానికి సైతం సిద్ధమంటున్నారు.

IAF's first woman Su-30 weapon system operator
su30 rider tejaswi

By

Published : Sep 27, 2022, 9:23 PM IST

ఆకాశమే హద్దు

మహిళల అభివృద్ధికి అడ్డుకట్ట వేసేలా గిరిగీసి హద్దులను నిర్ణయిస్తున్న ఈ రోజుల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు మహిళా పైలట్లు. వైమానిక దళంలో పెరుగుతున్న మహిళా పైలట్లే అందుకు నిదర్శనం. సియాచిన్​ లాంటి క్లిష్టమైన బేస్​ క్యాంప్ ​నుంచి ఈశాన్య సరిహద్దుల దాకా ఆకాశంలో అవలీలగా ఎగురుతున్నారు. విమానాలు నడపడమే కాదు యుద్ధానికీ వెనకాడేది లేదంటున్నారు. దేశం కోసం ఏమైనా చేసేందుకు సిద్ధమని ముందుకు వస్తున్నారు.

యుద్ధ విమానం నడపడం అంటే అంత తేలిక కాదు. అలాంటిది భారత వాయుసేనలో సేవలందిస్తున్న లెఫ్టినెంట్ తేజస్వీ.. ఫైటర్ జెట్​ను అవలీలగా నడిపేస్తున్నారు. మన దేశంలో ఆయుధ వ్యవస్థ కలిగిన విమానాన్ని నడిపిన తొలి మహిళగా ఇప్పటికే రికార్డుకెక్కిన తేజస్వీ... క్యాంప్​లో ఉన్న పురుష పైలట్లకు దీటుగా ఆకాశంలో విన్యాసాలు చేస్తున్నారు. సుఖోయ్-30 లాంటి భారీ యుద్ధ విమానాలను సులువుగా నడిపేస్తున్నారు తేజస్వీ. 'వెపన్ సిస్టమ్ ఆపరేటర్' తేజస్వీ అంటే ఒక బ్రాండ్​లా అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

"ఏదైనా నిజమైన ఆపరేషన్‌లో భాగం కావాలనే భారత వైమానిక దళంలోని ప్రతి పైలట్ శిక్షణ పొందుతారు. అలాంటి ఆపరేషన్లలో పాల్గొన్నప్పుడే మా సత్తా ఎంటో తెలుస్తుంది. తూర్పు సెక్టార్‌లోని వివిధ స్థావరాలకు చెందిన మా పైలట్లు ఏ ఘటన జరిగినా ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం."
-తేజస్వీ, వాయుసేనలో లెఫ్టినెంట్

తూర్పు సెక్టార్‌లో చైనా సరిహద్దుకు దగ్గరగా ఉన్న తేజ్‌పుర్ ఫార్వర్డ్ ఎయిర్ బేస్‌లో తేజస్వీతో పాటు అవస్థి, నైనా అనే పైలట్లు సైతం శిక్షణ తీసుకుంటున్నారు. తూర్పు ప్రాంతాలోని దట్టమైన అడవుల్లోనూ ఫైటర్ జెట్‌లను నడిపేలా ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఇక్కడి వాతావరణం పైలట్లకు కఠిన సవాళ్లు విసురుతుంటుంది. కానీ అలాంటి అడ్డంకులను దాటుకుంటూ ఆకాశంలో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ వనితలు.

'టచ్ ది స్కై విత్ గ్లోరీ' అన్న భారత వైమానిక దళ నినాదాన్ని నిజం చేస్తూ.. అడ్డంకులను అధిగమించి దూసుకెళ్తున్నారు. భారత వాయుసేనలో సేవలందించాలని కలలు కంటున్న ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరింత మంది మహిళలు సైతం ఈ రంగంలోకి ప్రవేశించి తమ కలలను నెరవేర్చుకోవాలని ఈ మహిళా పైలట్లు ఆశిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details