నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రంతో మళ్లీ చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయిత్ చెప్పారు. అయితే.. కేంద్రం ఈ చట్టాలను రద్దు చేసే అంశం గురించి మాత్రమే చర్చిస్తామని పునరుద్ఘాటించారాయన. ఇటీవల మృతిచెందిన అభయ్ సింగ్ సంధు(భగత్‌సింగ్ మేనల్లుడు) కుటుంబానికి సంతాపం తెలిపేందుకు మొహాలి(ఛత్తీస్‌గఢ్)కి వెళ్లిన ఆయన.. ఈ మేరకు అక్కడి విలేకర్లతో సంభాషించారు. కేంద్రం.. రైతుల డిమాండ్లను నెరవేర్చకపోతే నిరసన స్థలాల నుంచి స్వస్థాలకు తిరిగొచ్చే ప్రసక్తే లేదని టికాయిత్ స్పష్టం చేశారు. కేంద్రం ఏదైనా మాట్లాడితే.. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)తోనే చర్చించాలన్నారు.
ఆ రోజున 'బ్లాక్ డే'
అన్నదాతలు నిరసన చేపట్టి ఈ నెల 26 నాటికి ఆరు నెలలు పూర్తవుతున్న సందర్భంగా.. ఆ రోజున 'బ్లాక్ డే'గా పాటించనున్నారు. అదే రోజున దేశవ్యాప్త నిరసన చేపట్టాలని ఎస్కేఎం పిలుపునిచ్చింది. దానికి రైతు సంఘాలు మద్దతు తెలిపాయి.