రాజకీయ జీవితానికి అడ్డుగా ఉంటే నటన నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్. తన రాజకీయ ప్రవేశం చారిత్రకమైనదని అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే తాను అనూహ్యంగా ఇందులోకి ప్రవేశించానని కోయంబత్తూరులో మీడియా ప్రతినిధులతో చెప్పారు.
"మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ఎమ్మెల్యేగా అనేక సినిమాల్లో నటించారు. ప్రజా సేవే లక్ష్యంగా ఆ చిత్రాల్లో తన సిద్ధాంతాలను తెలియజేశారు. ప్రస్తుతం నేను చేస్తున్న చిత్రాలను పూర్తి చేస్తాను. ఆ తర్వాత రాజకీయాలకు సినిమా అడ్డుగా ఉంటే దానికి దూరంగా ఉండేందుకు సిద్ధం. నేను త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకుని మళ్లీ సినిమాలు చేస్తానని పలువురు అంటున్నారు. ఎవరు రాజకీయాల నుంచి తప్పుకోవాలో ప్రజలే నిర్ణయిస్తారు."