త్రిముఖ పోరు నెలకొన్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 259 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. కాగా మంగళవారం సాయంత్రం 4 గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. 28 లక్షల ఓటర్ల కోసం 3,328 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 1100 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా 28 పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. నెల రోజుల పాటు సాగిన హై వోల్టేజి ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు భాజపా తరఫున ప్రచారం నిర్వహించారు.
60 స్థానాలు.. 259 మంది అభ్యర్థులు.. త్రిపుర పోలింగ్‌కు సర్వం సిద్థం - tripura election 2023 date
గురువారం జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 28 లక్షల మంది ఓటర్ల కోసం 3,328 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికార భాజపా, ప్రతిపక్ష సీపీఎం, తిప్రా మోథా పార్టీల మధ్య ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది.
25 ఏళ్ల వామపక్ష పాలనకు చరమగీతం పాడి 2018లో త్రిపురలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.. పీఠాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రతిపక్ష సీపీఎం పార్టీకి చెందిన కీలక నేతలు కూడా త్రిపురలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి కాంగ్రెస్‌తో కలిసి సీపీఎం త్రిపుర ఎన్నికల బరిలో నిలిచింది. ఐతే త్రిపుర ఎన్నికల్లో రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ప్రచారం నిర్వహించలేదు. కొత్తగా వచ్చిన తిప్రా మోథా పార్టీ ప్రధాన పార్టీలకు సవాలు విసురుతూ త్రిపురలో త్రిముఖ పోటీకి తెరదీసింది.
త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 259 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 20 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. భాజపా 55 చోట్ల, దాని మిత్రపక్షం ఐపిఎఫ్టీ 6 చోట్ల పోటీ చేస్తోంది. ఒక చోట ఇరుపార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ నెలకొంది. ఇక విపక్ష కూటమిలో సీపీఎం 47 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 13 చోట్ల బరిలో ఉన్నాయి. తిప్రా మోథా పార్టీ 42 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపింది. తృణమూల్ కాంగ్రెస్ 28 చోట్ల పోటీ చేస్తోంది. 58 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మార్చి 3 తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.