తెలంగాణ

telangana

ETV Bharat / bharat

59 స్థానాలు.. 369 మంది అభ్యర్థులు.. మేఘాలయలో పోలింగ్​కు సర్వం సిద్ధం - మేఘాలయలో ఎన్నికల తేదీ

సోమవారం జరగనున్న మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 59 స్థానాల్లో 369 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 21 లక్షల మంది ఓటర్ల కోసం 3,419 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికార ఎన్​పీపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, టీఎంసీ, బీజేపీ పార్టీల మధ్య పోటీ నెలకొంది.

Meghalaya assembly election 2023
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు

By

Published : Feb 26, 2023, 4:48 PM IST

ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో శాసనసభ ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనుంది. మొత్తం 60 స్థానాలకు గానూ 59 స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు. యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ(యూడీపీ) అభ్యర్థి హెచ్​డీఆర్​ లింగో మరణించడం వల్ల సోహియాంగ్ నియోజకవర్గానికి జరగాల్సిన పోలింగ్ వాయిదా పడింది. అన్ని పార్టీల నుంచి 369 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 36 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 21 లక్షల మంది ఓటర్ల కోసం 3,419 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. ఎన్​పీపీ 57, కాంగ్రెస్ 56, యూడీపీ 46, టీఎంసీ 58 స్థానాల్లో పోటీ చేస్తోంది.

అధికార ఎన్​పీపీ ఎలాగైనా రెండో అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు, మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా నేతృత్వంలో టీఎంసీ.. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించాలని తహతహలాడుతోంది. భాజపా తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎన్​పీపీ తరఫున మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రచారాన్ని హోరెత్తించారు.

పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్న అధికారులు

దక్షిణా తురా నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా బరిలోకి దిగుతున్నారు. ఆయనపై మాజీ తీవ్రవాద నేత బెర్నార్డ్ మారక్​ను పోటీకి దింపింది బీజేపీ. అలాగే కాంగ్రెస్ తరఫున బ్రెంజీల్డ్ మారక్​ బరిలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నస్ట్ మావ్రే.. పశ్చిమ షిల్లాంగ్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆయనపై ఎన్​ఎన్​పీ అభ్యర్థి మొహేంద్రో రప్సాంగ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ విన్సెంట్ పాల.. సుట్నాగ-సైపంగ్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అలాగే మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా.. అంపాటి, తిక్రికిల్లా నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.

పోలింగ్ కేంద్రం వల్ల అధికారులు, భద్రతా బలగాలు

మేఘాలయలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికం. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 21 లక్షలు కాగా.. అందులో 10.99 లక్షల మంది మహిళా ఓటర్లు, 10.68 లక్షల మంది పురుష ఓటర్లు ఉన్నారు. మొట్టమొదటి సారిగా 81 వేల మంది వయోజనులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

2018 మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గానూ 21 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్​పీపీ) 20 సీట్లలో విజయం సాధించింది. ప్రాంతీయ పార్టీలు, బీజేపీ మద్దతుతో ఎన్​పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి ఎన్​పీపీ, బీజేపీ విడివిడిగానే పోటీ చేసున్నాయి.

ABOUT THE AUTHOR

...view details