జమ్మూలోని వైమానిక స్థావరం వద్ద ఇటీవల డ్రోన్ల దాడి(Drone Attack) తీవ్ర కలకలం రేపింది. ఈ దాడికి వాడిన పేలుడు పదార్థాల మిశ్రమాల్లో ఆర్డీఎక్స్(Rdx), నైట్రేట్ ఉన్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలల్లో గుర్తించారు. భారత్‌లో ఆర్డీఎక్స్ ఎక్కడా లభించదు. దీనిని పాకిస్థాన్ నుంచి తెప్పించాల్సిందే. ఫలితంగా పేలుళ్లలో ఉపయోగించిన ఈ ఒక్క పదార్థమే.. పాక్ పాత్రను తెలియజేస్తోంది.
ఈ దాడికి చైనాలో తయారైన జీపీఎస్ డ్రోన్ వాడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దాడికి వాడిన రెండు బాంబుల్లో ఒకటి పెద్దదిగా ఉంది. దీనిని వైమానిక స్థావరాల్లో కట్టడాలను ధ్వంసం చేయడానికి సిద్ధం చేసినట్లు భావిస్తున్నారు. రెండో బాంబు.. మనుషులను లక్ష్యంగా చేసుకొని తయారు చేసినట్లు చెబుతున్నారు. ఎందుకంటే తొలి పేలుడు తర్వాత అక్కడకు చేరుకున్న వారు మరణించాలనే లక్ష్యంతో దానిలో ఎక్కువగా బాల్‌బేరింగ్ గుండ్లు, మేకులు వంటివి ఉంచారు. ఈ ఆధారాలన్నీ లష్కరే తోయిబా పాత్రను తెలియజేస్తున్నాయి. పాక్ సైన్యంలో అప్రకటిత భాగంగా లష్కరే తోయిబాకు పేరుండగా ఆ దేశం సైన్యం ఈ స్థాయి పేలుడు పదార్థాలు, ఆయుధాలను దానికి సమకూరుస్తోంది.
డ్రోన్ల సేకరణపై కన్ను
గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా సరిహద్దుల్లో బలగాల మోహరింపు, ఆయుధాలు సమకూర్చుకొనే హడావుడిలో భారత్ ఉంటే.. పాక్ మాత్రం డ్రోన్ల శక్తిని పెంచుకోవడం మొదలుపెట్టినట్లు సమాచారం. టర్కీ, చైనా నుంచి భారీ ఎత్తున చిన్నసైజు మానవరహిత విమానాలు కొనుగోలు చేసినట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది. పాక్ సైన్యం 'సూపర్‌కామ్ 250' అనే మానవ రహిత విమానంతో నిఘా, సమాచార సేకరణ అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. జూన్ 24న నెస్‌కామ్ బుర్రాక్ మానవ రహిత విమానంతో ఒక లేజర్ గైడెడ్ క్షిపణిని పరీక్షించింది. పలు రక్షణ, శాస్త్ర సాంకేతిక విభాగాలు ఈ పరీక్షల్లో పాల్గొన్నాయి.