Raven horse for sale: మహారాష్ట్రలోని నందూర్బర్ జిల్లా సారంగ్‌ఖేడ్ అశ్వాల మార్కెట్ స్థానికంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. వేర్వేరు జాతుల గుర్రాలు.. ఏటా ఇక్కడకు అమ్మకానికి వస్తాయి. నాసిక్ నుంచి వచ్చిన 10 అశ్వాలు ఈసారి సారంగ్‌ఖేడ్ మార్కెట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వాటిలో ప్రధానంగా ఆకట్టుకున్న గుర్రమే రావణ్. రూ.5 కోట్లు ఇచ్చి కొనేందుకు ఔత్సాహికులు ముందుకు వచ్చినా అమ్మేందుకు దాని యజమాని అసద్ సయ్యద్ నిరాకరించారు.
అశ్వం రావణ్ నల్లగా ఉంది. నుదుటిపై.. తెల్లని మచ్చ ఉంది. ఇది మార్వార్ జాతికి చెందిన అరుదైన గుర్రం. 68 అంగుళాల ఎత్తు ఉంది. మహారాష్ట్రలో కెల్లా ఇదే ఎత్తైన గుర్రమని దాని యజమాని చెబుతున్నారు. రావణ్ రోజుకు పది లీటర్ల పాలు, కేజీ నెయ్యి, ఐదు గుడ్లు, చిరు ధాన్యాలు, తవుడు, ఎండు పండ్లు తింటుందని అసద్ సయ్యద్ చెప్పారు. ఇది చాలా అరుదైనది కాబట్టి ఐదు కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖరీదు ఉంటుందని, అందుకే ఐదు కోట్లకు అమ్మేందుకు నిరాకరించానని ఆయన అన్నారు.