Rave Party in Hyderabad : సరదా కోసం మొదలైన అలవాటు.. మత్తులోకి నెడుతోంది. గతంలో సిగరెట్, మద్యంతో సరిపెట్టుకునే యువత.. ఇప్పుడు నిషా కోసం గంజాయి, మాదకద్రవ్యాల బారినపడి మత్తుకు బానిసలవుతున్నారు. తాజాగా హైదరాబాద్ మహానగరంలో మరోసారి రేవ్ పార్టీ గబ్బు రేపింది. మాదాపూర్‌లో రేవ్ పార్టీని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. ఈ పార్టీలో భారీగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. పార్టీలో లభించిన డ్రగ్స్‌ను సీజ్ చేశారు. నిందితులను మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల అదుపులో ఓ సినీ నిర్మాతతో పాటు ఐదుగురు ప్రముఖులు ఉన్నారని యాంటీ నార్కోటిక్స్(Telangana Anti Narcotics Bureau) అధికారులు వెల్లడించారు.
Rave Party Breaks Out in Madhapur :'నగరంలో మాదాపూర్ వద్ద విఠల్‌రావు నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు మాకు ముందస్తుగా సమాచారం అందింది. వెంటనే మేం టీమ్స్‌ను అలర్ట్ చేశాం. పార్టీ మొదలయ్యే సమయానికి అక్కడికి చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేశాం. కానీ మేం వెళ్లేసరికే అక్కడ చాలా మంది డ్రగ్స్ వినియోగిస్తూ మత్తులో తూలుతున్నారు. వాళ్లందరినీ అదుపులోకి తీసుకున్నాం. వారు వినియోగిస్తున్న డ్రగ్స్(Drugs Seized Hyderabad)ను సీజ్ చేశాం. ఈ రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. ఈ డ్రగ్స్‌ను ఎవరు తీసుకువచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నాం. పార్టీ నిర్వాహకులు తెచ్చారా లేదా డ్రగ్ డీలర్స్ ఎవరైనా పార్టీలో ఉన్నారా అనే విషయంపై కూపీ లాగుతున్నాం. ఈ రేవ్ పార్టీలో ఓ సినిమా నిర్మాత కూడా పట్టుబడ్డాడు. అతడితో పాటు మరో ఐదుగురు పేరు మోసిన ప్రముఖులు ఉన్నారు. వాళ్లందరిని మాదాపూర్ పోలీసులకు అప్పగించాం.' అని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారి ఒకరు చెప్పినట్లు సమాచారం.
Producer Venkat Arrested in Hyderabad Rave Party : ఈ రేవ్ పార్టీని సినీనిర్మాత వెంకట్ నిర్వహించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గతంలోనూ ఓ చోట వెంకట్ నిర్వహించిన పార్టీ పై పోలీసులు దాడులు చేయగా... ఆయన తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి వెంకట్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు.. రాత్రి పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే విఠల్రావ్నగర్లోని అపార్ట్మెంట్లో నిర్వహించిన దాడిలో వెంకట్ బృందం చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. మత్తు పదార్థాలతో పట్టుబడిన నిందితులను మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి.... మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.