దేశంలో అన్ని వర్గాల వారికి వర్తించేలా ఓ సమగ్ర 'జనాభా విధానాన్ని' రూపొందించాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. నాగ్‌పుర్‌లో జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దసరా ర్యాలీలో పాల్గొన్న భాగవత్.. పలు అంశాల గురించి ప్రసంగించారు. వర్గాల-ఆధారిత జనాభా అసమానత ఓ ప్రధాన అంశమని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదని ఉద్ఘాటించారు. జనాభా అసమతుల్యత భౌగోళిక సరిహద్దుల్లో మార్పులకు దారితీస్తుందని భాగవత్ పేర్కొన్నారు.
జనాభా నియంత్రణకు ప్రయత్నిస్తున్న మనం.. చైనాలో ఏం జరుగుతోందో ఓసారి చూడాల్నారు. 'ఒకే సంతానం' విధానాన్ని అవలంబించిన చైనా ఇప్పుడు వృద్ధ దేశంగా మారుతోందన్నారు. 57 కోట్ల యువత కలిగిన భారత్.. మరో 30 ఏళ్ల పాటు యువ దేశంగా కొనసాగనుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో జనాభాకు అనుగుణంగా వనరులను పెంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఆయన.. మరో 50 ఏళ్ల తర్వాత భారత్‌కు ఏం జరుగుతుంది..? ఆ జనాభాకు సరిపడా ఆహారం మన దగ్గర ఉంటుందా? అనే విషయంపై శ్రద్ధ వహించాలన్నారు.