Thefts in Hyderabad : చోరీలు చేయడంలో ఈ దొంగ స్టైలే వేరు. ఒంటరిగా ద్విచక్ర వాహనంపై సంచరిస్తాడు. యజమాని లేని ఇల్లు కనిపించిందా ఇక అంతే సంగతులు. ఇలా కొల్లగొట్టిన సొత్తుతో పారిపోయి జల్సాలు చేస్తాడు. డబ్బు అయిపోగానే మళ్లీ దోపిడీలు ప్రారంభిస్తాడు. ఈ విధంగా 2014 నుంచి హైదరాబాద్‌పై పంజా విసురుతూ వందల ఇళ్లను దోచేశాడు. ఇంకా సెల్‌ఫోన్ వాడకపోవడం ఇతగాడి మరో ప్రత్యేకత.
Rashid Khan Thief : సైబరాబాద్, రాచకొండ పరిధిలో పెద్ద ఎత్తున ఇళ్లల్లో చోరీలకు పాల్పడే కరడుగట్టిన నేరస్థుడు రషీద్ ఖాన్ మరోసారి తన పంజా విసిరాడు. ఈక్రమంలోనే తాజాగా కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ వ్యాపారి ఇంట్లో.. రూ.8 లక్షల నగదు, 20 తులాల బంగారంతో పాటు ఒక లాకర్‌ను ఎత్తుకెళ్లాడు. ఘటన జరిగిన స్థలంలో ఆధారాలు, చోరీ జరిగిన తీరును పోలీసులు విశ్లేషించి.. కరడుగట్టిన నేరగాడు రషీద్ ఖాన్ చేసినట్లుగా గుర్తించారు. అతడిని వెతికేందుకు సీసీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
తొమ్మిదేళ్లుగా కనిపించని ఆచూకీ :ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన రషీద్ ఖాన్.. కరడుగట్టిన నేరస్థుడు. సంగారెడ్డి, సైబరాబాద్, రాచకొండ పరిధిలో కనీసం వందకుపైగా దొంగతనాలు చేశాడు. కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. సెల్‌ఫోన్ వాడకపోవడం ఇతగాడి ప్రత్యేకత. చివరిగా 2014లో ఛత్తీస్‌గఢ్‌లోని పండరీపురం పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత బెయిలుపై బయటికొచ్చాడు. అప్పటినుంచి అతను.. ఆచూకీ చిక్కకుండా చోరీలకు పాల్పడుతున్నాడు.
Hyderabad Thief Rashid Khan : ఒకేసారి కనీసం మూడు, నాలుగు దొంగతనాలు చేసి రషీద్ ఖాన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. ఆ తరువాత పోలీసుల అన్వేషణ ఆగిపోయిందని తెలియగానే మళ్లీ చోరీలకు ప్లాన్ చేస్తాడు. తాజాగా రాచకొండ పరిధిలోనే నాలుగు దోపిడీలు చేశాడు. ఇండ్లలోని ప్రధాన ద్వారానికి బదులు బెడ్ రూం కిటికీలు తొలగించి దొంగతనం చేయడం ఇతని ప్రత్యేకత.