రాజ్యసభ నుంచి గత నాలుగేళ్లలో ప్రజలకు (rajya sabha latest news) విస్తృతమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఛైర్మన్‌గా వెంకయ్యనాయుడు బాధ్యతలు చేపట్టిన ఈ నాలుగేళ్ల కాలంలో ఆయన పెద్దల సభ విషయాలను ప్రజలకు చేరవేయడానికి విశేషంగా కృషిచేశారు. 2017 ఆగస్టులో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఇప్పటివరకు సభ కార్యకలాపాల పనితీరు గురించి ప్రజలకు వివరిస్తూ పెద్దల సభ సచివాలయం 491 పత్రికా ప్రకటనలు విడుదల చేసింది. ఇందులో సచివాలయం 263, ఛైర్మన్ కార్యాలయం 228 ఇచ్చింది. అంతకుముందు అయిదేళ్లతో పోలిస్తే వీటిసంఖ్య నాలుగున్నర రెట్లు పెరగడం గమనార్హం.
2012-17 మధ్యకాలంలో కేవలం 135 పత్రికా ప్రకటనలు మాత్రమే విడుదలయ్యాయి. ప్రజలకు చేరువయ్యేందుకు రాజ్యసభ చేసిన కృషిని వివరిస్తూ రూపొందించిన నివేదికను సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఛైర్మన్ వెంకయ్యనాయుడికి సమర్పించారు. సభ కార్యకలాపాలకు సంబంధించిన విభిన్న కోణాలను ప్రజలకు అందించాలన్న ఛైర్మన్ సూచనలమేరకు రాజ్యసభ సచివాలయం క్రియాశీలకంగా వ్యవహరించింది. ఇప్పటివరకు విడుదల చేసిన ప్రకటనల్లో అత్యధికం వివిధ పరిశోధనాంశాలకు చెందినవేనని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రాజ్యసభ పనిచేసిన తీరు, దాని ఉత్పాదకత శాతం, 1952 నుంచి చేసిన చట్టాలు, అందులో అత్యంత ప్రధానమైన చట్టాల వివరాలు, చట్టాలను ఆమోదించడానికి కేటాయించిన సమయం, ఇతర సభాకార్యకలాపాలకు ఇచ్చిన ప్రాధాన్యం, సభలో అధికార, ప్రతిపక్షాల బలాబలాలు మారిన నేపథ్యంలో సభా కార్యకలాపాలపై ఆ సంఖ్య చూపిన ప్రభావం గురించి రాజ్యసభ సచివాలయం విశ్లేషించింది. అలాగే పార్లమెంటు స్థాయీసంఘాల పనితీరును 1993 నుంచి పరిశీలించింది. సభలో, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌లో సభ్యుల భాగస్వామ్యం, సభా కార్యకలాపాలకు జరిగిన అంతరాయం గురించీ మదించి లెక్కలు తేల్చి ఆ వివరాలను ప్రజలముందుంచింది. ఇవే కాకుండా సభా నిర్వహణ సమయంలో అధ్యక్షుడు వ్యక్తంచేసిన అభిప్రాయాలు, ఉద్బోధనలు, సభ స్తంభించినప్పుడు దాన్ని పరిష్కరించడానికి ఛైర్మన్ సభాపక్షనేతలతో నిర్వహించిన సమావేశాల వివరాలనుకూడా వెల్లడించింది. పార్లమెంటు స్థాయీసంఘాలు సభముందు నివేదికలు ఉంచినప్పుడు అందులోని ముఖ్యాంశాలను వివరిస్తూ పత్రికా ప్రకటనలు విడుదల చేసింది. పార్లమెంటు అంతిమంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కాబట్టి దాని కార్యకలాపాల గురించి ప్రజలకు నిరంతరం తెలియజేస్తూ ఉండాలన్న ఛైర్మన్ వెంకయ్యనాయుడు సూచనలమేరకు విస్తృతంగా సమాచారాన్ని విడుదలచేస్తున్నట్లు సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు పేర్కొన్నారు.
గోవాలో ఉపరాష్ట్రపతి