Rape Attempt On Patient At Hospital: రాజస్థాన్లోని అజ్మేర్లో దారుణం జరిగింది. రక్తపోటు సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ.. వైద్యం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. చికిత్స పొందుతున్న ఆమెపై అక్కడ పనిచేస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం..అజ్మేర్కు చెందిన ఓ 23 ఏళ్ల మహిళ.. గత కొద్దిరోజులుగా రక్తపోటు సమస్యతో బాధపడుతుంది. ఆరోగ్యం మరింత క్షీణించడం వల్ల వైద్యం కోసం స్థానికంగా ఉన్న జేఎల్ఎన్ ప్రభుత్వాసుపత్రికి తన సోదరుడితో వెళ్లింది. కాసేపటికే అతడు వేరే పనిమీద బయటకెళ్లాడు. ఇదే అదనుగా తీసుకుని.. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి రాజేశ్ ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి సోదరుడు సాయంత్రం వచ్చి చూసేసరికి ఆమె నిస్సహాయ స్థితిలో పడి ఉంది. మాట్లాడే స్థితిలో కూడా లేదు. దీంతో వెంటనే అతడు వేరే ఆసుపత్రికి ఆమెను తరలించాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలికి మత్తుమందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉద్యోగం కోసం వచ్చిన వివాహితపై అత్యాచారం
ఉద్యోగం వెతుక్కుంటూ ముంబయి వచ్చిన ఓ 19 ఏళ్ల వివాహితపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు కొందరు కామాంధులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల్ని అరెస్ట్ చేశారు. "కోల్కతాకు చెందిన ఓ 19 ఏళ్ల వివాహిత.. ఉద్యోగం కోసం తన బంధువుతో ముంబయికు వచ్చింది. కుర్లా ప్రాంతంలో ఆమెపై తన బంధువుతో పాటు మరో ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. నలుగురు నిందుతుల్ని అరెస్ట్ చేశాం." అని పోలీసులు తెలిపారు.