మధ్యప్రదేశ్ గ్వాలియర్లో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి.. అనంతరం రాయితో కొట్టి హత్య చేశాడు ఓ కామాంధుడు. పొదల్లో మృతదేహాన్ని పడేసి పరారయ్యాడు. నిందితుడు.. బాధితురాలికి బంధువు అని పోలీసులు తెలిపారు. కల్లు రాఠోడ్ను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. హజీరా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న బాలిక రెండు రోజుల నుంచి కనిపించడం లేదు. తన సోదరుడు, స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా.. బంధువు కల్లు రాఠోడ్ వచ్చి ఆమెను రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమీపానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి.. అనంతరం రాయితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాలికను తీసుకెళ్తున్నట్లు సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుడ్ని పోలీసులు గుర్తించారు. హజీరా పోలీస్ స్టేషన్ సమీపంలో బాలిక మృతదేహం నగ్నంగా లభ్యమైందని తెలిపారు.