రంగారెడ్డి జిల్లాలో ఓట్ల పండుగ వచ్చిదంటే ప్రధాన పార్టీల జోరు రసవత్తరమే! Rangareddy Political Vibes in Assembly Election :రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలో ప్రధాన పార్టీల మధ్య పోలింగ్ ఎపుడొచ్చినా.. పోరు పతాకస్థాయిలోనే ఉంటుంది. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడతాయి. కొన్నిచోట్ల బీజేపీ బలమైన పోటీ ఇస్తున్నా.. చాలా నియోజకవర్గాల్లో రెండు, మూడు స్థానాలకే పరిమితం. ప్రధాన పార్టీల అభ్యర్థులకు స్వతంత్రులు అక్కడక్కడ ఝలక్ ఇచ్చి తలరాతలు మారుస్తుంటారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలున్నాయి.
రంగారెడ్డి పరిధిలో చేవెళ్ల, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్బీనగర్ , ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, షాద్ నగర్, కల్వకుర్తి ఉండగా వికారాబాద్ పరిధిలో వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్.. మేడ్చల్ పరిధిలో మేడ్చల్, మల్కాజ్ గిరి, ఉప్పల్, కూకట్ పల్లి(KukatPally Constituency), కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో ఎల్బీనగర్, తాండూరు, మహేశ్వరంలో కాంగ్రెస్ గెలువగా.. మిగతా 14 చోట్ల బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. నెల తిరగకుండానే తాండూరు, ఎల్బీనగర్, మహేశ్వరం విజేతలు కారెక్కేశారు. మొత్తం 17 నియోజకవర్గాలు గులాబీమయంగా మారాయి.
కాంగ్రెస్ బీ ఫామ్ నిలిపివేసిన స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట
సీనియర్లయిన సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవులు దక్కాయి. ఆయా నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ మరింత బలాన్ని పుంజుకుంది. ఈసారి ఎన్నికల్లో ఉప్పల్ మినహా సిట్టింగ్‌లకే టికెట్లు(Sitting MLA) ఇచ్చిన బీఆర్ఎస్.. అభివృద్ధి నినాదంతో ఓటర్ల తలుపుతడుతోంది. జిల్లాలో నియోజకవర్గాల పునర్విజన తర్వాత 2009లో ప్రభావం చూపిన కాంగ్రెస్ బీఆర్ఎస్ రాకతో 2014 నుంచి ప్రభావం తగ్గిపోతూ వచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఓటమి సహా జిల్లాలో కీలకమైన స్థానాలను కైవసం చేసుకునే లక్ష్యంగా హస్తం పార్టీ ఆరు గ్యారంటీల నినాదంతో గడప గడపను తాకుతోంది.
Telangana Elections 2023 :బీఆర్ఎస్లో అసంతృప్తి నాయకులను చేర్చుకుంటూ గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులు గులాబీ పార్టీను వీడినందున బలం పుంజుకున్నామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఏడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. నాలుగుసార్లు టీడీపీ గెలిచింది. బీఆర్ఎస్ ఒక్కసారి మాత్రమే విజయం దక్కించుకుంది. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కాలె యాదయ్య గులాబీ పార్టీలో చేరికతో అక్కడి కాంగ్రెస్ బలం తగ్గిపోయింది. 2018లోనూ అధికార పార్టీ నుంచే మరోసారి కాలె యాదయ్య గెలుపొందారు.
ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొడతాననే ధీమాతో ఉన్నారు. రాజేంద్రనగర్‌లో పాగా వేయాలని కాంగ్రెస్, ఎమ్ఐఎమ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. ఫలితం దక్కడం లేదు. చేవేళ్ల నుంచి విడిపోయి నియోజకవర్గంగా అవతరించినప్పటి నుంచి ప్రకాశ్ గౌడే ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకున్నారు. నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మహేశ్వరం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minster Sabitha Indra Reddy) ఐదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. నాలుగు సార్లు గెలిచిన సబితా ఐదోసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని సబిత విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో జోరుగా సాగుతున్న ప్రచారం, ప్రజలకు హామీల వెల్లువ
కాంగ్రెస్ తన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో సీనియర్ నేత, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని రంగంలోకి దింపింది. బీజేపీ.. అందెల శ్రీరాములుకు టికెట్ ఖరారు చేసింది. మహేశ్వరంలో త్రిముఖ పోటీ తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎల్బీనగర్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగానే ఉంది. ఇప్పటివరకు ఇక్కడ గులాబీ పార్టీ ఖాతా తెరవలేదు. 2014, 2018లో ఆ పార్టీ అభ్యర్థి రామ్మోహన్ గౌడ్ ఓడిపోయారు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి భారాస పంచన చేరగా.. మరోసారి అధికార పార్టీ నుంచి టికెట్ ఖరారైంది.
Election Campaign in Telangana : కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీని బరిలో దింపింది. లక్షకుపైగా సెటిలర్ల ఓట్లు అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోషించనున్నాయి. పార్టీ కంటే వ్యక్తికే ప్రాధాన్యమిచ్చే ఇబ్రహీంపట్నంలో ఓటర్లు వరుసగా మూడుసార్లు మంచిరెడ్డి కిషన్ రెడ్డికే పట్టం కట్టారు. 2009, 2014లో తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచిన కిషన్ రెడ్డి.. 2018లో బీఆర్ఎస్ నుంచి విజేతగా నిలిచారు. నాలుగోసారి పోటీలో నిలిచారు. కాంగ్రెస్ పాగా వేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మూడు ఎన్నికల్లోనూ పరాభవం చవిచూసిన కాంగ్రెస్.. మల్ రెడ్డి రంగారెడ్డికే టికెట్ ఇచ్చింది.
ఉప్పల్‌లో ఒక్కో పార్టీ ఒక్కోసారి మాత్రమే గెలిచాయి. 2009లో కాంగ్రెస్, 2014లో బీజేపీ, 2018లో బీఆర్ఎస్ విజయాన్ని అందుకున్నాయి. మళ్లీ పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు గట్టిగానే పోరాడుతున్నాయి. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని పక్కనపెట్టి.. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి రామాంతాపూర్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్ రెడ్డి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించిన భంగపడ్డ నాయకులంతా కారెక్కారు. బీజేపీ టికెట్ మరోసారి ప్రభాకర్‌కే దక్కింది. 2 లక్షల మంది సెటిలర్ ఓటర్లు ఎటు మొగ్గితే వారు బయటపడే అవకాశం ఉంది.
Rangareddy Political News :మల్కాజ్ గిరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సమాన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. 2018లో గులాబీ పార్టీ నుంచి మైనంపల్లి హన్మంతరావు గెలుపొందారు. సిట్టింగ్‌కే అధికార పార్టీ టికెట్ ఇచ్చినా.. అనూహ్య పరిస్థితుల్లో మైనంపల్లి కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ నుంచి మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. మైనంపల్లి, మర్రి మధ్య ఈసారి హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి మంత్రి మల్లారెడ్డి బరిలోకి దిగి వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేశ్ యాదవ్ గ్రామీణ ఓటర్లపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు.
భవిష్యత్ ప్రాంతీయ పార్టీలదేనా?
కూకట్‌పల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుదే హవా. పార్టీలకు అతీతంగా వ్యక్తి ప్రాధాన్యంగానే ఓటర్లు స్పష్టమైన ఆధిపత్యం కట్టబెడుతున్నారు. 2014లో టీడీపీ నుంచి, 2018లో గులాబీ పార్టీ నుంచి బరిలోకి దిగిన మాధవరం స్పష్టమైన ఆధిక్యంతో సత్తా చాటారు. కూకట్‌పల్లిలో పెద్దగా ప్రభావం చూపని కాంగ్రెస్.. బండి రమేష్‌ను పోటీలో నిలపగా.. సెటిలర్లును తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వరాష్ట్రంలో కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్ బోణి కొట్టలేదు. రెండుసార్లు గెలిచిన అధికార పార్టీ అభ్యర్థి వివేకానంద.. మూడోసారి పాగా వేయాలని కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ కొలను హనుమంతరెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టింది. కూన శ్రీశైలం గౌడ్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. సెటిలర్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ యత్నిస్తున్నాయి.
Rangareddy Election History :రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లున్న శేరిలింగంపల్లిలో ప్రధాన పార్టీలు ఒక్కోసారి గెలిచాయి. 2014 నుంచి గెలుస్తూ వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీనే మరోసారి పోటీలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి జగదీశ్వర్ గౌడ్ బరిలో నిలిచారు. బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్యే తీవ్ర పోటీ ఉండబోతుంది. వికారాబాద్‌లో విజయకేతనం కోసం కాంగ్రెస్ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఇక్కడ పోటీ చేసిన ప్రతీసారి రెండో స్థానానికే పరిమితమైంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు టికెట్ ఇవ్వగా.. ముచ్చటగా మూడోసారి గడ్డం ప్రసాద్ కుమార్‌నే హస్తం పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది.
బీఆరఎస్-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఖాయమని తెలుస్తోంది. పరిగిలో గులాబీ పార్టీ అభ్యర్థి కొప్పుల మహేశ్ రెడ్డిపై రెండోసారి కాంగ్రెస్ నుంచి రాంమోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉన్నా.. ఓటర్లు కారుకే పట్టం కట్టారు. ఎప్పుడూ అంచనాలకు అందని నియోజకవర్గం తాండూరు. అభ్యర్థులు ఒకటి తలిస్తే ఓటర్లు మరోలా విలక్షణ తీర్పు ఇస్తుంటారు. ఊహించని ఫలితం అభ్యర్థులను కలవరపెడుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డి ఆ తర్వాత కారెక్కారు. మంత్రి పట్నం మహేందర్ రెడ్డిపై గెలిచిన రోహిత్ రెడ్డికి ఈసారి కళ్లెం వేసేందుకు కాంగ్రెస్ డీసీసీబీ ఛైర్మన్ మనోహర్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టింది.
Rangareddy Election 2023 MLA Candidates :రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నియోజకవర్గాల్లో కొడంగల్ ఒకటి. 2009, 2014 ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి గెలుపొందారు. 2018లో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆ ఇద్దరే బరిలోకి దిగి పోరాడుతున్నారు. నరేందర్ రెడ్డి గెలుపు కోసం మహేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని క్షేత్రస్థాయిలో శ్రమిస్తుండగా.. రేవంత్‌ని గెలిపించేందుకు పాతికేళ్లు ఎమ్మెల్యేగా అనుభవం ఉన్న గురునాథ్ రెడ్డి కృషిచేస్తున్నారు.
కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న షాద్ నగర్ రెండుసార్లు గులాబీ రెపపెపలాడింది. 2014, 2018లో గెలిచిన అంజయ్య యాదవ్‌నే బీఆర్ఎస్ మళ్లీ బరిలో దింపింది. వీర్లపల్లి శంకర్ అభ్యర్థిత్వంతో మళ్లీ పుంజుకోవాలని కాంగ్రెస్ ఆశపడుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 42 లక్షల మంది ఓటర్లుండగా.. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో సెటిలర్ల ఓట్లు కీలకంగా మారబోతున్నాయి.
40 మందితో బీజేపీ ప్రచారకర్తల జాబితా విడుదల, విజయశాంతికి దక్కని చోటు