Lashkar Bonalu 2023 :సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతరకన్నుల పండువగా సాగింది. తొలి రోజు అమ్మవారిని వేలాదిగా దర్శించుకున్న భక్తులు.... రెండో రోజు వేడుకల్లో ప్రధాన కార్యక్రమమైన రంగం కార్యక్రమం ఇవాళ అట్టహాసంగా సాగింది. అమ్మవారు చెప్పే భవిష్యవాణిని ఆసక్తిగా విన్నారు. ఉదయం అమ్మవారి అలయం నుంచి పసుపు, కుంకుమలు, వస్త్రాలతో మాతంగి స్వర్ణలత నివాసానికి వెళ్లిన ఆలయ సిబ్బంది, పూజారులు... ఆమెకు పసుపు రాసి డప్పు చప్పుళ్ళ మధ్య ఆలయానికి తీసుకువచ్చారు. రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత అమ్మవారి పేరిట భవిష్యవాణి పలికింది. ప్రజల పూజలు సంతోషంగా అందుకున్నానని చెప్పారు. గతేడాది మీరు ఇచ్చిన వాగ్దానం మరిచిపోయారన్నారు. కావాల్సిన బలాన్నిచ్చానని.. భక్తుల వెంటే ఉంటానని చెప్పారు. ఆలస్యమైనా వర్షాలు తప్పకుండా వస్తాయని భవిష్యవాణి పలికారు.
Rangam in Lashkar Bonalu 2023 : 'అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి.. ప్రజలు భయపడవద్దు. నా వద్దకు వచ్చే ప్రజలను కాపాడే భారం నాదే. ఎలాంటి లోపాలు లేకుండా చూసుకునే భాధ్యత నాదే. ఐదు వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలి. ఏది బయటపెట్టాలో ఏది పెట్టకూడదో నాకు మాత్రమే తెలుసు. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటున్నా' అని స్వర్ణలత అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. భవిష్యవాణి వినేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.
Talasani Srinivas Yadav Comments at Rangam :భవిష్యవాణి అనంతరంమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్మాట్లాడారు. రంగం కార్యక్రమంతో భవిష్యవాణి పూర్తయిందన్నారు. మరికాసేపట్లో పోతరాజుల ఊరేగింపు, ఘటోస్తవం ఘనంగా జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారని తెలిపారు. రాత్రంతా దర్శనాలు జరిగాయన్న తలసాని... సీఎం, మంత్రులు, వివిధ పార్టీల పెద్దలు మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్నారన్నారు.