Ramoji Rao Help to Para Badminton player Rupa Devi: అనుకోని ప్రమాదంలో కాళ్ల కదలిక కోల్పోయినా.. మొక్కవోని పట్టుదలతో జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణికి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఆర్థికంగా చేయూత అందించారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం సంతవురిటికి చెందిన పడాల రూపాదేవి వచ్చే నెల 9న థాయ్‌లాండ్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమైనా.. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై ఈ నెల 26న ‘ఈనాడు వసుంధర’లో, ‘ఈటీవీ - యువ’లో వచ్చిన కథనాన్ని చూసిన రామోజీరావు చలించిపోయారు. థాయ్‌లాండ్ వెళ్లేందుకు అవసరమైన 3 లక్షల రూపాయలను సమకూర్చారు. రెండు కాళ్లు కోల్పోయినా చెక్కుచెదరని దృఢ సంకల్పంతో పారా బ్యాడ్మింటన్ రంగంలో మున్ముందుకు సాగుతున్న రూపాదేవికి ఆశీస్సులు అందిస్తూ ఉత్తరం రాశారు.
‘అన్నీ ఉండీ ఏమీ చేయలేమంటూ కుంగి, కుమిలిపోయే వారికి మీ కథ గొప్ప కనువిప్పు. ఒక వైపు క్రీడారంగంలో రాణిస్తూనే చదువునూ కొనసాగిస్తున్న మీ ఆశయం నాలో కూడా కొత్త ఉత్సాహం నింపింది. థాయ్‌లాండ్‌లో జరగనున్న అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనడానికి కావాల్సిన 3 లక్షల రూపాయలను సాయంగా అందిస్తున్నాను. మీ వంటి ధైర్యశాలికి ఇలా చేయూత అందించడం నాకు గర్వంగా ఉంది. ఈ అంతర్జాతీయ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి మీరు దేశానికే గర్వకారణంగా నిలిస్తే అది చూసి ఆనందించే వాళ్లలో నేను ముందుంటాను’ అని పేర్కొన్నారు.