Para Badminton Rupadevi latest news: 'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు' అనే మాటను రుజువు చేస్తూ.. ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం దాకా ఎంతోమంది యువతీ-యువకులు అనేక రంగాల్లో వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటం కోసం అహర్నిశలు శ్రమించి.. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించి.. అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తాను నిరూపించుకున్నారు. ఆ విధంగా.. తన కళను సాకారం చేసుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి ముందడుగు వేసింది.
అయితే, ఆమెకు అనుకోని పరిస్థితిలో అంగ వైకల్యం దాపురించింది. పేదరికం వెంటాడుతోంది. అయినా కూడా దేశానికి పారా బ్యాడ్మింటన్‌లో గోల్డ్ మెడల్స్ తీసుకురావడానికి సిద్దమైంది. ప్రస్తుతం ఆ లక్ష్యం వైపుగా ముందుకు సాగుతోంది. మరికొన్ని రోజుల్లో థాయ్‌లాండ్‌లో జరగనున్న అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ పోటీలో పాల్గొనడానికి ఎంపికైంది. కానీ, ఆర్థిక సమస్యను అధిగమించలేక సతమతమైంది. అటువంటి తరుణంలో 'ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్' ఆమెను పలకరించింది. ఆ యువతి సమస్యను ఇంటర్వ్యూ ద్వారా లోకానికి తెలియజేసింది. ఆ యువతి పరిస్థితిపై స్పందించిన.. రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఆమెకు ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు.
అంగ వైకల్యం-అంతర్జాతీయం.. శ్రీకాకుళం జిల్లా సంతవురిటి గ్రామానికి చెందిన పడాల రూపాదేవికి అనుకోకుండా జరిగిన ప్రమాదంలో తన రెండు కాళ్లలో చలనం కోల్పోయింది. తన జీవితం ఇంతే అని కూర్చోకుండా.. తలరాతకు తలొంచకుండా తట్టుకుని నిలబడింది. చిన్న పల్లెటూరు నుంచి క్రమంగా ఎదుగుతూ.. పారా బ‌్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో బంగారు, వెండి పతకాలు గెలిచిన ఈ యువతి.. మే 9 నుంచి 14 వరకు థాయ్‌లాండ్‌లో జరగబోయే అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించింది. కానీ, అది లక్షలతో కూడుకున్న వ్యవహారం. వీరి కుటుంబ ఆర్థిక స్థాయి అంతంత మాత్రమే. తనకు ఆర్థిక సాయం అందిస్తే దేశానికి కచ్చితంగా పతకం తెస్తానంటూ.. తనకు దాతలు సహాయం చేయాలంటూ వేడుకుంది.