Ramoji rao attends modi meeting: ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను విజయవంతం చేసేందుకు తమవంతు కృషి చేస్తున్నట్టు రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన.. ఈనాడు దినపత్రిక ద్వారా స్వాతంత్ర్య ఉద్యమం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు సహా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని మరుగునపడిన సమరయోధులపై ప్రత్యేక కథనాలు ఇస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఈనాడులో ప్రత్యేక బృందం పనిచేస్తోందని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 15న మొదలైన ఈ కథనాలు వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు కొనసాగిస్తామని వివరించారు. ప్రతిరోజు ఓ కొత్త కథనం ద్వారా పాఠకులకు భిన్నమైన విషయాలను చెబుతున్నట్టు తెలిపారు. భావితరాల కోసం ఏడాదిపాటు ప్రచురించిన కథనాలతో తెలుగు, ఆంగ్ల భాషల్లో పుస్తకాలను ప్రచురిస్తామని రామోజీరావు వివరించారు. ఇదే సమయంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశంలో అంతరించిపోయే దశలో కళలు, హస్తకళల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని రామోజీరావు కోరారు.
"ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ను పురస్కరించుకొని ఒక సూచనను ప్రతిపాదిస్తున్నాను. కళలు, చేతివృత్తులు, సంస్కృతిపరంగా భారతదేశం ఎంతటి మహోన్నతమైనదో మనకు తెలుసు. కానీ కాలక్రమేణా ఆయా కళలు, చేతివృత్తులు, చేనేతలు క్రమంగా అంతరించి పోతున్నాయి. ఆయా రంగాలు చాలా నిర్లక్ష్యానికి గురయ్యాయి. వాటిని సజీవంగా ఉంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ఈ సందర్బంగా ఆలోచించాలని మనవి. తద్వారా ఎంతో ఉన్నతమైన భారత సంస్కృతి, కళలు, చేనేతలను యావత్ ప్రపంచానికి తెలియజేయవచ్చు."