Ramoji Film City MICE Delhi 2023 :భారత్, రష్యాల మధ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దిల్లీలో ఏర్పాటు చేసిన మైస్-2023 (MICE 2023 Delhi) కార్యక్రమంలో రామోజీ ఫిల్మ్ సిటీ స్టాల్ను స్టూడియో ప్రతినిధులు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈ స్టాల్ను చూసేందుకు విచ్చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఫీచర్లు, అక్కడ ఉండే ఏర్పాట్లు వంటి వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లో అంతర్జాతీయ టూరిస్ట్ కేంద్రంగా నిలుస్తున్న రామోజీ ఫిల్మ్ సిటీ గురించి.. స్టూడియో ప్రతినిధులు.. సందర్శకులకు వివరించారు.
సినిమా షూటింగ్లు, వివాహాలు, కార్పొరేట్ సమావేశాలు, వ్యాపార సదస్సులకే కాకుండా.. అన్ని రకాల కార్యక్రమాలకు రామోజీ ఫిల్మ్ సిటీ (ఆర్ఎఫ్సీ) గమ్యస్థానంగా మారిపోయిందని ఆర్ఎఫ్సీ సీనియర్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) టీఆర్ఎల్ రావు పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటివరకు 3,500 సినిమాల షూటింగ్లు జరిగాయని చెప్పారు. ప్రతి ఏటా 350 నుంచి 400 సదస్సులు జరుగుతాయని వివరించారు.
"రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రతి ఏడాది 100 నుంచి 125 వివాహాలు జరుగుతాయి. ప్రతి ఏడాది 20 లక్షల మంది ఫిల్మ్ సిటీ సందర్శనకు వస్తుంటారు. పర్యటకులు రెండు నుంచి మూడు రోజుల పాటు ఫిల్మ్ సిటీలోని వివిధ హోటళ్లలో ఉండేందుకు ఆసక్తి చూపుతారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా గిన్నిస్ రికార్డుల్లోనూ ఆర్ఎఫ్సీ పేరు సంపాదించింది. వెడ్డింగ్ ప్లానర్లు, మెస్ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది.. సందర్శకులను ఆహ్వానించేందుకు ఏడాదంతా అందుబాటులో ఉంటారు."
--టీఆర్ఎల్ రావు, రామోజీ ఫిల్మ్ సిటీ సీనియర్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)