Rameshbabu Praggnanandhaa Interview : చెస్ ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచే సామర్థ్యం తనకు ఉందని భావిస్తున్నానని భారత యువ సంచలనం, గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద తెలిపాడు. వచ్చే సంవత్సరాల్లో తప్పక గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు. చెస్ ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచి.. దేశ ప్రజలతో పాటు ప్రధాని ప్రశంసలు సైతం అందుకున్న ప్రజ్ఞానంద.. మంగళవారం నుంచి జరగనున్న టాటా ఇంటర్నేషనల్ చెస్ టోర్నీలో పాల్గొనేందుకు కోల్‌కతాకు వచ్చాడు. ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో కాసేపు ముచ్చటించాడు. ఆ విషయాలు మీకోసం.
మంగళవారం నుంచి జరిగే టాటా ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ గురించి మీ అభిప్రాయం?
నేను ఈ టోర్నీ గురించి పెద్దగా ఆలోచించట్లేదు. మన టీం చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ప్రస్తుతం నేను రిలాక్స్‌గా ఉన్నాను.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌పై మీ ఆలోచనలు ఏంటి?
నేను చెప్పేది ఒక్కటే.. ప్రపంచ ఛాంపియన్ అయ్యేందుకు కావల్సిన నైపుణ్యాలు, సామర్థ్యం నాకు ఉన్నాయి. కొన్నేళ్లలో ప్రంపంచ ఛాంపియన్ అవుతాననే నమ్మకం నాకు ఉంది.
లెజెండరీ ఆటగాడు కార్ల్‌సెన్‌తో పోటీ పడటం మీకు ఎలా అనిపించింది?
ఆన్లైన్ చెస్ అయినా ఆఫ్‌లైన్ చెస్ అయినా కార్ల్‌సెన్ చాలా సమర్థంగా ఆడగలడు. నేను కార్ల్సన్తో ఆడే సమయంలో అతడి నుంచి చాలా నేర్చుకునేందుకు ప్రయత్నించాను. అతడు గత 10 ఏళ్ల నుంచి చెస్‌లో ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నాడు. పోటీలో కార్లసన్ ఆట తీరును, ఎత్తులను తెలుసుకునేందుకు ప్రయత్నించాను.
మిమ్మల్ని విశ్వనాథన్ ఆనంద్ వారసుడు అంటారు. దానికి మీ సమాధానం?
నేను విశ్వనాథన్ ఆనంద్ గారి అకాడమీలో చాలా రోజుల పాటు ఉన్నాను. ఆ సమయంలో ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మ్యాచ్‌కు ముందు రోజు డైట్ ప్లాన్ ఎలా ఉండాలి? మ్యాచ్ సమయంలో మానసికంగా, శారీరకంగా బలంగా ఉండేందుకు ఏం చేయాలి? వంటి విషయాలు ఆయనతో చర్చించా.