Ram Temple Construction:ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకుంటోంది. 2023 చివరి నాటికి గుడిని పూర్తి చేయాలని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గడువు పెట్టుకుంది. తాజాగా మందిర నిర్మాణ కమిటీ.. పనుల పురోగతిపై నివేదిక సమర్పించింది. దీన్ని బట్టి, గడువులోపే నిర్మాణం పూర్తి అయ్యే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.
Ayodhya Ram Temple update:ఐఏఎస్ అధికారి నృపేంద్ర మిశ్ర నేతృత్వంలోని మందిర నిర్మాణ కమిటీ సోమవారం నివేదిక విడుదల చేసింది. ఆలయ నిర్మాణం పునాది దశకు చేరుకుందని తెలిపింది. పీఠం ఎత్తు పెంచే పనులు 2022 జనవరి 24న ప్రారంభమయ్యాయని వెల్లడించింది. "పునాదిని 6.5 మీటర్ల ఎత్తుకు పెంచుతాం. తెలంగాణ, కర్ణాటక నుంచి గ్రానైట్ రాళ్లను తీసుకొచ్చాం. ఎత్తు పెంచేందుకు వీటిని ఉపయోగిస్తున్నాం. ఒక్కోటి 5×2.5×3 అడుగుల పరిమాణం ఉన్న 17వేల గ్రానైట్ రాళ్లను వాడుతున్నాం. ఈ పని సెప్టెంబర్ నాటికి పూర్తవుతుంది. అందంగా చెక్కిన రాళ్లను అమర్చే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది. పునాది నిర్మాణం, రాళ్లను అమర్చే ప్రక్రియ ఏకకాలంలో కొనసాగుతుంది. రాళ్లను చెక్కే పని కొనసాగుతోంది. కొన్ని రాళ్లు అయోధ్యకు వచ్చేశాయి. రాజస్థాన్ నుంచి గులాబీ రంగు సున్నపురాయి, తెల్లటి మార్బుల్ తీసుకొస్తున్నాం. గర్భగుడిలో వీటిని ఉపయోగిస్తాం" అని నివేదికలో పేర్కొన్నారు.