తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీతారాముల బ్యాంక్.. రామ నామాలు డిపాజిట్.. పుణ్యం మీ సొంతం!

ఆ బ్యాంక్​లో లోన్లు ఇస్తారు.. డిపాజిట్లు తీసుకుంటారు.. ఖాతాలూ తెరుస్తారు.. అచ్చం వాణిజ్య బ్యాంకులా పనిచేస్తుంది. కానీ అదో ఆధ్యాత్మిక బ్యాంకు. రామ నామాలను డిపాజిట్లుగా తీసుకొని పుణ్యాన్ని ప్రసాదించే బ్యాంక్ అది!

ram-ramapathi bank
ram-ramapathi bank

By

Published : Mar 30, 2023, 2:36 PM IST

Updated : Mar 30, 2023, 5:01 PM IST

సీతారాముల బ్యాంక్.. రామ నామాలు డిపాజిట్.. పుణ్యం మీ సొంతం!

ఊళ్లలో.. డబ్బు దాచుకుని, లోన్లు తీసుకునే బ్యాంక్​ను మీరు చూసుంటారు. కానీ, రాముడి పేరుతో ఏర్పాటై.. రామ నామాలను డిపాజిట్లుగా తీసుకునే బ్యాంక్​ గురించి మీకు తెలుసా? అవును.. ఈ బ్యాంక్ ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసిలో ఉంది. శ్రీరామ నవమి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. 19 వందల కోట్ల రామ నామాలు ఇక్కడ ఉన్నాయంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

త్రిపుర భైరవి ప్రాంతంలోని మీర్​ఘాట్​లో ఈ బ్యాంక్ ఉంది. ఈ బ్యాంక్​ను మెహ్రోత్రా కుటుంబం గత 96 ఏళ్లుగా నడిపిస్తోంది. రామ నవమి సందర్భంగా వందలాది మంది ఇక్కడికి వచ్చి ఖాతాలు ప్రారంభిస్తుంటారని నిర్వాహకుడు సుమిత్ మెహ్రోత్రా చెబుతున్నారు. ఈ బ్యాంకులో ఖాతాదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తెలిపారు.

రామ్ రమాపతి బ్యాంక్​లో రామ నామాలు

"రామ్ రమాపతి బ్యాంక్ 1926లో మా తాతకు తాతైన దాస్ చన్నూలాల్ ద్వారా ప్రారంభమైంది. బ్యాంక్ అనే పదం వినిపించగానే.. దీన్ని సాధారణ వాణిజ్య బ్యాంకు అని భావిస్తుంటారు. రామ్ రమాపతి బ్యాంకులో లోన్ దొరుకుతుంది అని చెబితే.. డబ్బులు ఇస్తారేమో అనుకుంటారు. కానీ ఇది ఆధ్యాత్మిక బ్యాంకు. డబ్బులతో ఈ బ్యాంకుకు సంబంధం లేదు. వాణిజ్య బ్యాంకుల లోన్లతో పోలిస్తే రామ్ రమాపతి బ్యాంకు ఇచ్చే లోన్లకు తేడా ఏంటంటే.. ఇక్కడ మనసులో ఉన్న కోరికను నెరవేర్చుకునేందుకు లోన్లు ఇస్తాం. దీంతో పాటు భూలోకంతో పాటు పరలోకంలో శాంతి కోసం లోన్లు ఇస్తాం."
-సుమిత్ మెహ్రోత్రా, బ్యాంకు నిర్వాహకుడు

ఈ బ్యాంకులో ఖాతాలు ప్రారంభించే వారికి కిల్విష్ చెట్టు నుంచి తయారు చేసిన పెన్ను, రామ నామం రాయడానికి పేపర్ ఇస్తారు. బ్రహ్మ ముహూర్తంలో- అంటే- ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల మధ్య రామ నామాలు రాయాల్సి ఉంటుంది. మొత్తం లక్షా 25 వేల రామ నామాలు రాసి మళ్లీ ఈ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. ఇందుకు ఖాతాదారులకు ఎనిమిది నెలల పది రోజుల సమయం ఇస్తారు. రామ నామాలు రాస్తున్న సమయంలో ఉల్లి, వెల్లుల్లి వేసిన ఆహారంతో పాటు బయటి నుంచి తెచ్చిన ఆహారం తినకూడదనే నియమం ఉంది.

రామ్ రమాపతి బ్యాంక్​

ఈ బ్యాంకులో స్వచ్ఛందంగానే ఖాతాలు ప్రారంభిస్తుంటారని సుమిత్ తెలిపారు. రాముడిని స్మరించుకొని.. ఏదైనా కోరికలు కోరుకొని రామ నామాలు రాయడం ప్రారంభించాలని చెబుతున్నారు. ఇలా చేస్తే కోరికలు తప్పక నెరవేరుతాయని అంటున్నారు. ఇప్పటివరకు 1942కోట్ల 34 లక్షల 25 వేల రామ నామాలు బ్యాంకులో డిపాజిట్ అయ్యాయని తెలిపారు. దేశ రెండో ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి తల్లితో పాటు సినీ నటుడు శతృజ్ఞ సిన్హా వంటి ప్రముఖులు సైతం ఈ బ్యాంకులో ఖాతాదారులుగా ఉన్నారు.

జననం నుంచి మరణం వరకు..
మీరా దేవి అనే వృద్ధురాలు ఎన్నో ఏళ్ల నుంచి రామ నామాలు రాస్తూ ఇక్కడ డిపాజిట్ చేస్తున్నారు. ప్రతిసారి తనకు శ్రీరాముడి ఆశీర్వాదం లభిస్తోందని అంటున్నారు.

"నా జన్మ రామ నామం రాయడంతోనే ప్రారంభమైంది. నా కోరికలన్నీ నెరవేరాయి. రాముడి దయతో ఇప్పటివరకు బాగానే ఉంది. ఇప్పటివరకు నాలుగు సార్లు రామ నామం రాశాను. ఇకపైనా రాయాలని మనసులో ఉంది. నన్ను ఆ భగవంతుడు ఇలాగే ఆరోగ్యంగా చూసుకుంటే ఎప్పటికీ ఆయన సేవ చేసుకుంటా."
-మీరా దేవి, బ్యాంకు ఖాతాదారు

ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది ఈ బ్యాంకులో ఖాతాదారులుగా ఉన్నారు. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జపాన్ దేశాల్లో ఉండే వారు సైతం ఇక్కడ ఖాతాలు తెరుస్తున్నారు. ఈ బ్యాంకులో ఖాతాలు ప్రారంభించి, రామ నామాలు డిపాజిట్ చేసిన తర్వాత నుంచి తమకు మంచి జరుగుతోందని అనేక మంది చెబుతున్నారు.

Last Updated : Mar 30, 2023, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details