Ram Mandir Pran Pratistha : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ కోరారు. మకర సంక్రాంతి నుంచి ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22 వరకు అన్ని దేవాలయాలను శుభ్రం చేయాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చినట్లు ఆయన చెప్పారు. రామ భక్తులు, హిందువులు సహా భారతీయులందరూ ఇందులో పాల్గొనాలంటూ రాయ్ ఎక్స్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
"ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22 మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్, ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగుతుంది. సుమారు 4,000 మంది సాధువులు ఇందులో పాల్గొంటారు. ప్రాణప్రతిష్ఠ రోజు ఉదయం 10 గంటలకు ఆలయాల్లో భజనలు చేయాలని కోరుతున్నాను. ఆలయ యాజమాన్యాలు ఈ వేడుకను లైవ్ టెలికాస్ట్ చేసేలా ఏర్పాటు చేయాలి. రాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం హారతి ఇచ్చాకే అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలి. వారి ఆర్థిక పరిస్థితికి తగ్గట్లుగా ప్రసాద పంపిణీ చేయాలి. సాయంత్రం ప్రతి ఒక్కరూ దీపాలను వెలిగించాలి."
--చంపత్ రాయ్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి
రాముడితో గర్భగుడిలోకి మోదీ
అయోధ్య రాముడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నారు. 84 సెకన్ల అద్భుత ముహూర్తంలోనే ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. ఇందుకోసం ప్రధాని మోదీ సుమారు 300 మీటర్లు నడవనున్నారు. పూజ మండపం నుంచి గర్భగుడికి 25 సెకన్లలోనే చేరుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని కాశీకి చెందిన పండిత్ లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలో జరగనుంది.
"ప్రాణప్రతిష్ఠ పూజ కార్యక్రమాలు మొత్తం సుమారు 40 నిమిషాల వరకు ఉంటుంది. అయితే, అసలు ముహూర్తం మాత్రం కేవలం 84 సెకన్లు మాత్రమే. ఆ సమయంలోనే ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ పూజ చేస్తారు. కాశీకి చెందిన 50 మంది పండితులు ఇందులో పాల్గొంటారు. వీరిలో ఐదుగురు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. మిగిలిన పూజారులు 14, 15 తేదీల్లో చేరుకుంటారు."
--సునీల్ లక్ష్మీకాంత్ దీక్షిత్, పండితులు