Ram Mandir Pran Pratishtha Ritual :అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు క్రతువులు కొనసాగుతున్నాయి. మంగళవారం సరయు నది తీరంలో దీపోత్సవం, హారతి వంటి కార్యక్రమాలను నిర్వహించగా, బుధవారం కలశ పూజ జరిగింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా, ఆయన భార్య, ఇతరులు సరయు నది తీరంలో ఈ కలశ పూజను నిర్వహించారు. అనంతరం కలశాలలో సరయు నది నీటిని రామ మందిరానికి తీసుకెళ్లారు.
మరోవైపు అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి గురువారం బాల రాముడి విగ్రహన్ని తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రదేశం వద్ద శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులతో పాటు నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్, పూజారి సునీల్ దాస్ పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. ప్రాణప్రతిష్ఠ జరిగే 22 తేదీ వరకు క్రతువులు జరుగుతాయని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఈ క్రతువులను నిర్వహించేందుకు సుమారు 121 మంది పురోహితులు వచ్చారని చెప్పారు. అయోధ్యలోని కరసేవకపురాన్ని సందర్శించి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు.
గర్భగుడికి రాముడి విగ్రహం
అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించే విగ్రహాన్ని గర్భగుడి సమీపానికి తీసుకొచ్చారు. ఓ వ్యానులో విగ్రహాన్ని తరలిస్తుండగా, అక్కడ ఉన్న ప్రజలందరూ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. అంతకుముందు గర్భగుడిలో రాముడిని ప్రతిష్ఠించే చోట ట్రస్ట్ సభ్యులు పూజలు నిర్వహించారు. మరోవైపు సూర్యకుండ్ ప్రాంతంలో రాముడి చరిత్రను లేజర్ షో వేశారు.