Ram Mandir Pran Pratishtha :ప్రతిష్ఠాత్మక అయోధ్య రామమందిరం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే నెల 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో బాలుడి రూపంలో ఉన్న రాముడిని ప్రతిష్ఠిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెల్లటి మకర్న పాలరాయితో నిర్మించిన గర్భగుడిలో 51 అంగుళాల పొడవైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ట్రస్ట్ తెలిపింది. ఐదేళ్ల వయసున్న రాముడి కోసం ప్రస్తుతం మూడు డిజైన్లను రూపొందించామని, అందులో ఒకదానిని ఎంపిక చేస్తామని ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామమందిరానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం
- సుమారు 22 లక్షల ఘనపు అడుగుల రాయితో ఆలయ నిర్మాణం
- ఇంజినీర్లు కృత్రిమంగా రూపొందించిన 56 పొరల రాయితో పునాది
- 17000 గ్రానైట్ బ్లాక్స్, ఐదు లక్షల ఘనపు అడుగుల గులాబీ రాయి వాడకం
- తెలంగాణ, కర్ణాటక నుంచి గ్రానైట్, రాజస్థాన్ నుంచి గులాబీ రాయి సేకరణ
- ఆలయ నిర్మాణంలో 392 పిల్లర్లు, 44 తలుపులు
- జీ ప్లస్ 2 పద్ధతిలో ఆలయ నిర్మాణం- ప్రతి అంతస్తు ఎత్తు 20 అడుగులు
- ఆలయ అవసరాల కోసం ప్రత్యేక నీటి శుద్ధీకరణ ప్లాంటులు
- సొంత డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, నీళ్ల కోసం అండర్ గ్రౌండ్ రిజర్వాయర్
- ఆలయ కాంప్లెక్స్‌లో రెండు మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌లు, ఒక వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్
- 20 ఎకరాల్లో ఆలయ నిర్మాణం, 50 ఎకరాల్లో పచ్చదనం పెంపు
- సంప్రదాయ నాగర శైలిలో ఆలయ సముదాయం నిర్మాణం
- తూర్పు-పడమర దిశలో 380 అడుగుల పొడవు- 250 అడుగుల వెడల్పు- 161 అడుగుల ఎత్తుతో నిర్మాణం
- వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ర్యాంపులు
- 25వేల మంది భక్తులు సెల్‌ఫోన్లు, పాదరక్షలు, చేతి గడియారాలు భద్రపరుచుకునేందుకు వీలుగా పెద్ద సముదాయం ఏర్పాటు
- ఆలయంలో హెల్త్ కేర్ సెంటర్‌తో పాటు టాయిలెట్ బ్లాక్
- అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు భక్తులు త్వరగా బయటకు వెళ్లేందుకు ప్రత్యేక దారి
అయోధ్యలోని రామ మందిర పరిసరాలు ఎక్కువ భాగం పచ్చదనంతో నిండి ఉంటాయని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 70 ఎకరాల్లో 70 శాతం చెట్లు, మొక్కలతోనే విస్తరించి ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం 600 చెట్లను గ్రీన్ బెల్ట్‌లో సంరక్షిస్తున్నామని చెప్పారు. పచ్చదనంలో ఎక్కువ భాగం చెట్లే ఉంటాయని సూర్యరశ్మి కూడా ఫిల్టర్ అయ్యేలా ఉంటుందన్నారు.
సర్వాంగ సుందరంగా రామ్‌పథ్
అయోధ్య రామాలయానికి వెళ్లే రామ్పథ్ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు అధికారులు. ఇరువైపులా ఉన్న దుకాణాల షట్టర్లపై జై శ్రీరామ్ నినాదంతో పాటు స్వస్తిక్ గుర్తులను ముద్రిస్తున్నారు. సహదత్‌గంజ్ నుంచి నయా ఘాట్‌ను కలిపే ఈ 13 కిలోమీటర్ల పొడవైన రోడ్డును హిందూ మతానికి చెందిన గుర్తులతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ రోడ్డుపై జైశ్రీరామ్ జెండాలతో పాటు రాముడి, రామ్ దర్బార్ లాంటి ఇతర చిత్రపటాలను విక్రయిస్తున్నారు.