Ram Mandir In Meerut :రావణుడి అత్తమాల నగరంలో ఉన్న ఓ రామ మందిరానికి 35 ఏళ్లుగా భక్తులెవరూ వెళ్లలేదు. పూజారి ఒక్కరే ప్రతి రోజు ఆ ఆలయాన్ని శుభ్రం చేసి పూజలు నిర్వహిస్తున్నారు. 1987 నుంచి ఈ పరిస్థితి ఏర్పడిందని అర్చకుడు తెలిపారు. ఇంతకీ ఈ ఆలయానికి భక్తులు వెళ్లకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇదీ జరిగింది..లంకాధిపతి రావణుడి అత్తమామల నగరంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ ప్రసిద్ధి చెందింది. ఈ నగరంలోని స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల కాలనీలో 1962లో ఓ రామాలయాన్ని నిర్మించారు. కృష్ణుడి విగ్రహంతో పాటు శివలింగం కూడా ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. దాదాపు 25 ఏళ్ల పాటు ఈ గుడి కళకళలాడింది. అయితే 1987లో మేరఠ్‌లో మత ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణలకు భయపడి ఆలయ సమీపంలో ఉన్న హిందువులు తమ ఇళ్లను ఖాళీ చేసి నగరంలోని ఇతర ప్రదేశాలకు వెళ్లిపోయారు. అలా కొన్నేళ్లు గడిచాక ఈ ఆలయం ఉందన్న విషయం కూడా నగరవాసులకు తెలియకుండా పోయింది.
1987 నుంచి ఆలయ సమీపంలో ఒక్క హిందూ కుటుంబం మాత్రమే నివసిస్తోంది. 1989లో ఓ పూజారి కుటుంబం అక్కడికి వచ్చి స్థిరపడింది. అప్పటి నుంచి ఆ అర్చకుడు పూజలు నిర్వహించారు. ఆయన 2014లో చనిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన కుమారుడు ఆచార్య బాల్ గోవింద్ జోషి గుడి బాగోగులు చూసుకుంటున్నారు. ఆలయ కమిటీ సభ్యులు కూడా నగరంలో వేరే చోట ఉంటున్నారు. దీంతో ప్రతి రోజు పూజారి ఒక్కరే గుడిని శుభ్రం చేస్తూ.. పూజలు నిర్వహిస్తున్నారు.