Ram Devotees Ayodhya Cycling And Skating :కాలినడకన కొందరు- సైకిల్ తొక్కుతూ మరికొందరు- స్కేటింగ్ చేస్తూ ఇంకొందరు- మార్గాలు వేర్వేరు కావొచ్చు- కానీ వారందరి లక్ష్యాలు ఒక్కటే. అయోధ్యకు ఎలాగైనా వెళ్లాలని, చారిత్రక ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించాలని ఇలా ఎంతో మంది సాహసయాత్రకు పూనుకున్నారు. ఉత్తర భారత గడ్డకట్టించే చలిలో రామ చంద్రుడి దర్శనం కోసం వెళ్తున్నారు. రాముడిపై అచంచల భక్తితో ముందడుగు వేసి ఐక్యతా సందేశం ఇస్తున్నారు. కొందరు ఇప్పటికే అయోధ్యకు చేరుకోగా, ఇంకొందరు రఘుకుల నందనుడి సన్నిధికి కొద్దిదూరంలో ఉన్నారు.
బిహార్‌కు చెందిన నితీశ్ కుమార్ తన స్వస్థలం మాధేపుర నుంచి అయోధ్యకు సైక్లింగ్ ద్వారా చేరుకున్నాడు. 615 కిలోమీటర్లు సైకిల్ తొక్కి శుక్రవారం రామ జన్మభూమిపై కాలుమోపాడు. సైకిల్‌కు ఓ జాతీయ జెండా, మూడు కాషాయ జెండాలు పెట్టుకొని ప్రయాణం చేశాడు 21 ఏళ్ల నితీశ్. జైశ్రీరామ్ నినాదం రాసి ఉన్న ప్లకార్డును సైకిల్‌కు తగిలించి రాఘవుడిని తలుచుకుంటూ ప్రయాణం సాగించాడు.
"బిహార్ నుంచి అయోధ్యకు రావడానికి నాకు ఏడు రోజుల సమయం పట్టింది. దారిలో విశ్రాంతి తీసుకునేందుకు ఉపయోగపడే స్లీపింగ్ బ్యాగు, కొన్ని అత్యవసర సామాను తప్ప నా సైకిల్‌పై ఇంకేమీ తీసుకెళ్లలేదు. ఈ యాత్ర చేయాలని సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడే నిశ్చయించుకున్నా. అప్పుడు నేను స్కూల్ విద్యార్థిని. వచ్చేసారి అయోధ్యకు నా కుటుంబంతో కలిసి వస్తా. మేమంతా రాముడిని బాగా విశ్వసిస్తాం. నా కుటుంబ సభ్యులు ఇంటి వద్దే వేడుకలు నిర్వహించుకుంటారు. నేను మాత్రం చారిత్రక ఘట్టంలో భాగం కావాలని అయోధ్యకు వచ్చా."
--నితీశ్ కుమార్, అయోధ్యకు సైకిల్‌పై చేరుకున్న యువకుడు
స్కేటింగ్ చేస్తూ అయోధ్యకు పయనం
వారణాసికి చెందిన సోనీ చౌరాసియా స్కేటింగ్ చేస్తూ అయోధ్యకు పయనమైంది. 124 గంటల పాటు డ్యాన్స్ మారథాన్ చేసి గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించిన సోనీ- అయోధ్యకు 228 కిలోమీటర్ల సాహస యాత్ర చేపట్టింది. జనవరి 17న వారణాసి నుంచి బయల్దేరిన సోనీ చౌరాసియా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న జనవరి 22న అయోధ్యకు చేరుకోనుంది. ప్రాణప్రతిష్ఠకు రావాలని సోనీకి ఇదివరకే ఆహ్వానం లభించడం విశేషం.
"గతంలోనూ ఇలా సుదూర స్కేటింగ్ యాత్ర చేశా. కానీ ఇప్పుడు వాతావరణం సవాళ్లు విసురుతోంది. చలి ఎక్కువగా ఉంది. నాతో పాటు నా కోచ్, వైద్యుడు వెంట ఉన్నారు. వాహనాలలో వారు నన్ను ఫాలో అవుతూ వస్తున్నారు."
-సోనీ చౌరాసియా, స్కేటింగ్ చేస్తూ అయోధ్యకు వెళ్తున్న మహిళ
పదేళ్ల బాలిక స్కేటింగ్
రాజస్థాన్ కోట్పుత్లీకి చెందిన పదేళ్ల హిమాన్షు సోనీ సైతం స్కేటింగ్ చేస్తూ అయోధ్యకు పయనమవుతోంది. 704 కిలోమీటర్ల దూరం స్కేటింగ్ చేయనుంది. జనవరి 16న ఇంటి నుంచి బయల్దేరింది సోనీ. 'నా కుటుంబం రాముడిని అమితంగా ఆరాధిస్తుంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం నేపథ్యంలో ఎక్కడ చూసినా దీపావళి తరహా వాతావరణం కనిపిస్తోంది. ప్రాణప్రతిష్ఠ రోజున అయోధ్యలో ఉండాలని అనుకున్నా. నా ట్యాలెంట్‌ను ప్రదర్శిస్తూ అక్కడికి చేరుకోవడం కంటే ఉత్తమ మార్గం ఇంకేముంటుంది?' అని అంటోంది సోనీ.