Rakesh tikait in election: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేఖ్ యాదవ్ ఆహ్వానాన్ని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ శనివారం తిరస్కరించారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే.. ఉత్తర్ప్రదేశ్లో అధిక విద్యుత్ ఛార్జీలు పెంపు సహా చెరకు రైతులకు చెల్లింపుల్లో జాప్యంపై ప్రభుత్వానికి తాను వ్యతిరేకంగా తాను పోరాడుతానని చెప్పారు.
"కేంద్రం మాతో అంగీకరించిన ఒప్పందాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేలా మేం పోరాడుతాం. రాష్ట్ర ప్రభుత్వం చెరకు రైతులకు సకాలంలో చెల్లింపులు ఇవ్వడం లేదు. మిల్లులకు ప్రభుత్వమే హామీదారు అయినందున.. చెల్లింపుల విషంయలో మిల్లులను ఒత్తిడి చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది."
-రాకేశ్ టికాయిత్, భారతీయ కిసాన్ యూనియన్ నేత
Tikait on Bjp: గ్రామాల్లోకి భాజపా నేతల రాకను ఎవరూ ఆపరని, వాళ్లు స్వేచ్ఛగా ప్రచారం చేస్తారని రాకేశ్ టికాయిత్ అన్నారు. భాజపాకు ప్రజలెవరూ ఓటు వేయరని చెప్పారు. రాష్ట్రంలో చెరకు రైతులకు సకాలంలో చెల్లించాలని, హరియాణాతో సమానంగా విద్యుత్ ఛార్జీలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తారని చెప్పారు. విద్య, నిరుద్యోగం, ఎంఎస్పీపై కూడా ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పారు.