Rakesh Tikait Ghazipur Border: దిల్లీ సరిహద్దుల్లో నిరసన స్థలాలను ఖాళీ చేయడానికి సంబంధించి రైతు నేత రాకేశ్ టికాయిత్ కీలక ప్రకటన చేశారు. డిసెంబరు 15 నాటికి రైతులు పూర్తిగా గాజీపుర్ సరిహద్దును ఖాళీ చేసి వెళ్లిపోతారన్నారు భారతీయ కిసాన్ యూనియన్ నేత. ఇప్పటికే మొదటి బృందం ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌కు శనివారం తిరిగి వెళ్లిపోయినట్లు వెల్లడించారు. రైతులందరూ సరిహద్దులను వీడాక తాను ఇంటికి చేరుకుంటాను అన్నారు టికాయిత్.
సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు సాగిన ఆందోళనలను విరమించిన రైతులు అధికారికంగా శిబిరాలను ఖాళీ చేస్తున్నారు. దిల్లీ సింఘు, టిక్రీ, గాజీపుర్ సరిహద్దుల వద్ద శిబిరాల తొలగింపు అనధికారికంగా.. గత గురువారమే ప్రారంభమైంది. పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు ఇళ్లకు బయలుదేరారు. గుడారాలు, శిబిరాలను తొలగించి సామాన్లను స్వస్థలాలకు తరలిస్తున్నారు.