కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్ ఉద్యమానికి పిలుపునిచ్చారు రైతు సంఘం నాయకుడు రాకేశ్ టికాయత్. దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరసనల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. దిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో పదేళ్లకు మించిన ట్రాక్టర్లు, ఇతర వాహనాల పై నిషేధం విధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు.
"ఇప్పటివరకు పొలాల్లో నడుస్తున్న ట్రాక్టర్లు ఇప్పుడు దిల్లీలోని ఎన్జీటీ కార్యాలయం వైపు నడుస్తాయి. ఇప్పటివరకు వాహనాల వయసు ఎంత అని ఎవరూ అడగలేదు. కానీ ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఉన్న కారణం ఏంటి? పదేళ్లకు మించిన పాత ట్రాక్టర్లను దశలవారీగా తొలిగించి కార్పొరేట్‌లకు సహాయం చేయాలా? ఇకపై ఆ ట్రాక్టర్లు కూడా సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో భాగం అవుతాయి."